Twitter edit button: ట్విటర్‌లో ఇకపై ఎడిట్ బటన్.. ముందుగా వారికే..!

ట్వీట్‌ చేశాక దానిని సవరించే వెసులుబాటు లేదని, తొలగించడం ఒక్కటే గత్యంతరమని యూజర్స్ నుంచి ఎన్నాళ్లుగానో ఫిర్యాదులు వస్తున్నాయి. కొత్తగా బోర్డులో చేరిన ఎలాన్ మస్క్ ఇటీవల ఆన్‌లైన్ పోల్ నిర్వహించిన తర్వాత కంపెనీ ఎడిట్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభిస్తుందనే మాట వినిపించింది. 
 

Twitter is working on an edit button for real

ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ కావాలా అని ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. దాదాపు 4.4 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. వారిలో 73 శాతం మంది ‘అవును’ అని చెప్పారు. ‘ఇప్పుడు అందరూ అడుగుతున్నారు.. అవును. మేం గత సంవత్సరం నుండి ఎడిట్ ఫీచర్‌పై పని చేస్తున్నాం’ అని ట్విట్టర్ తన కమ్యూనికేషన్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘కాదు.. మాకు ఆ పోల్ నుండి ఆలోచన రాలేదు’ అని ట్విటర్ టెస్లా బాస్‌‌ను పరోక్షంగా ప్రస్తావించింది. ‘ఎడిట్’ అనేది చాలా సంవత్సరాలుగా చాలాా మంది అడిగిన ట్విట్టర్ ఫీచర్ అని కంపెనీ కన్స్యూమర్ ప్రొడక్ట్ హెడ్ జే సలివన్ తెలిపారు.

‘ప్రజలు కొన్నిసార్లు ఇబ్బందికరమైనవి, తప్పులు, అక్షరదోషాలు క్షణంలో సరిదిద్దాలని కోరుకుంటారు. ప్రస్తుతం వారు ట్వీట్ తొలగించి, మళ్లీ ట్వీట్ చేయడానికే పరిమితమయ్యారు..’ అని తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఇంటర్నెట్ సంస్థ రాబోయే నెలల్లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తామని తెలిపింది. ఒకసారి ట్వీట్ చేశాక ఏయే అంశాలను సవరించడానికి వీలు పడుతుందో పరీక్షించనున్నట్టు తెలిపింది.

 ప్రస్తుతం ‘ట్విటర్ బ్లూ’ ద్వారా యూజర్స్ నెలనెలా 3 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ సేవలు పొందవచ్చు. వీరికి ప్రత్యేక కంటెంట్, ప్రత్యేక ఫీచర్లు లభ్యమవుతాయి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్‌లో ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ట్విట్టర్ అప్లికేషన్‌లో బ్లూ అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఇక మస్క్ తన బోర్డులో చేరతారని ట్విట్టర్ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రకటనతో మస్క్ ఈ సోషల్ మీడియా సంస్థ అవకాశాలను పెంచుతారన్న ఆశలు రేకెత్తాయి. 

ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మస్క్‌ను ‘ఉద్వేగభరితమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. సేవలను లోతుగా విమర్శించే వ్యక్తి’గా అభివర్ణించారు. అయితే మస్క్ త్వరలో ట్విటర్‌లో ముఖ్యమైన ఇంప్రూవ్‌మెంట్స్ తేవడానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. స్పేస్‌ఎక్స్ వెంచర్‌కు నాయకత్వం వహిస్తున్న, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ సోమవారం తన 73.5 మిలియన్ ట్విట్టర్ షేర్లను.. అంటే కంపెనీ సాధారణ స్టాక్‌లో 9.2 శాతం కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.

గత సంవత్సరం సీఈవో పదవి నుండి వైదొలిగిన ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఎడిట్ బటన్‌ను చాలాకాలంగా వ్యతిరేకించారు. సలివన్ తన పోస్ట్‌లలో ఆ ఆందోళనలను ప్రస్తావించారు. ‘సమయ పరిమితులు, నియంత్రణలు, సవరణలకు పారదర్శకత వంటి అంశాలు లేకుండా ఉన్నప్పుడు.. బహిరంగ సంభాషణల రికార్డ్‌ను మార్చడానికి ఎడిట్ ఫీచర్‌ను దుర్వినియోగం చేయవచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంస్థ ప్రధాన ప్రాధాన్యత ‘ఆ పబ్లిక్ సంభాషణ సమగ్రతను రక్షించడం..’ అని స్పష్టం చేశారు. ఎడిట్ ఫీచర్‌ను అభివృద్ధి చేయడానికి సమయం పడుతుందని, కంపెనీ దాని ప్రారంభానికి ముందుగానే దానిపై ఇన్‌పుట్స్, ప్రతిస్పందనలను స్వీకరిస్తుందని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios