ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ ‘ఆపిల్‌ ’ తమ కొత్త తయారీ యూనిట్లను చైనాలో ఏర్పాటుచేసింది. చైనానుంచే ఆపిల్ ఉత్పత్తులు అమెరికాకు దిగుమతి అవుతున్నాయి. 

ఆపిల్‌ ఉత్పత్తులపై ఉన్న ‘సుంకం మాఫీ’ వెసులుబాటును అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌ రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఆ అంశంపై  ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘ఆపిల్‌ సంస్థ తన కార్యకలాపాలను చైనాలో ప్రారంభిస్తే, అక్కడినుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వారి ఉత్పత్తులపై భారీస్థాయిలో సుంకాలను విధిస్తాం’ అని పేర్కొన్నారు.  వారు (ఆపిల్) చైనాకు వెళుతున్నారంటే ప్రారంభంలోనే వద్దు అని వారించానని, అమెరికాలో తయారుచేయకుంటే మాత్రం సుంకాలు తప్పవని ట్రంప్‌ వెల్లడించారు. 

ఆపిల్ సంస్థ చీఫ్ టిమ్‌కుక్‌ పట్ల తనకు ఎంతో గౌరవభావం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో టెక్సాస్‌లో తమ ప్లాంట్లను నిర్మిస్తామని ప్రకటిస్తే తాము ఎంతగానో సంతోషిస్తామని, అలాగే సుంకాల గురించి పునరాలోచన చేస్తామని పేర్కొన్నారు.

ఈ అంశంపై తన ట్విటర్‌లో స్పందిస్తూ ‘ అమెరికాలో తయారీ చేస్తే, మీకు సుంకాలు ఉండవు’ అని ట్వీట్‌ చేశారు. ట్రంప్ విధించిన సుంకం రమారమీ 100 డాలర్లు ఉంటుందని అంచనా. చైనాలో విడి భాగాలను తయారుచేసి.. అమెరికాలో అసెంబ్లీంగ్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది ఆపిల్ యాజమాన్యం.

చైనా ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకం విధించడం వల్ల 370 డాలర్ల ధర గల ఐఫోన్‌పై సుంకంతో కలిపి 400 డాలర్ల పైమాటే. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సంస్థలు ఇప్పటికే యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కు ఫిర్యాదు చేశాయి.