Asianet News TeluguAsianet News Telugu

భాగ్యనగరి ట్రాఫిక్‌ను సెర్చింజన్ సెట్ చేస్తుంది

హైదరాబాద్ నగర ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థకు గూగుల్‌ రూపురేఖలివ్వనున్నది. ఇకనుంచి జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ తెలుసుకుని, సిగ్నల్స్‌ సైకిల్‌లో మార్పుచేర్పులు చేయనున్నది. వచ్చే డిసెంబర్‌ నాటికి మూడు కమిషనరేట్లలో ఈ విధానం అమలులో రానుంది.  

The Police Department Made A Key Deal With Google For ITMS To Control Traffic
Author
Hyderabad, First Published Aug 29, 2019, 10:51 AM IST

హైదరాబాద్‌: తెలంగాణ రాజధాని నగరం భాగ్యనగరిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ పూర్తిగా టెక్నాలజీ పరం కానున్నది. దానికి ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగుల్’ సారథ్యం వహించనున్నది.

ఇప్పటిదాక మూస పద్ధతిలో ట్రాఫిక్ నియంత్రణ సాగుతున్నది. చిన్న జంక్షన్లలో 90 సెకన్లు, పెద్ద జంక్షన్లలో 240 సెకన్లలో సిగ్నల్స్‌ సైకిల్‌ పూర్తవుతుంది. సదరు జంక్షన్‌లోని ఓ రోడ్‌లో రెడ్‌లైట్‌ పడ్డాక మళ్లీ గ్రీన్‌లైట్‌ పడటానికి పట్టే సమయం ఇది. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తోపాటు చుట్టుపక్కల రోడ్లపై పడుతోంది. 

బేగంపేట నుంచి సికింద్రాబాద్‌–పంజగుట్ట మధ్య ఉన్న రహదారే తీసుకుంటే ఉదయం వేళల్లో సికింద్రాబాద్‌ వైపు నుంచి, రాత్రిపూట బేగంపేట దిశ నుంచి ట్రాఫిక్‌ ఎక్కువ. కానీ ఈ రూట్‌లోని జంక్షన్లలో సిగ్నలింగ్ సైకిల్‌ మాత్రం ఒకేలా పనిచేస్తోంది. భాగ్యనగరిలోని వివిధ జంక్షన్లలోని కొన్ని రోడ్లు ఖాళీగా, మరికొన్ని బంపర్‌ జామ్‌తో కిక్కిరిసిపోతుంటాయి.

విద్యాసంస్థలు, వాణిజ్య ప్రాంతాలు, ప్రభుత్వ–ప్రైవేట్‌ సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తరచూ ఈ పరిస్థితి  కనిపిస్తోంది. దీంతో ట్రాఫిక్‌ విభాగం ఓ జంక్షన్‌లోని ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్‌ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్‌ సైకిల్‌లోనూ మార్పు తేవచ్చని హైదరాబాద్ పోలీసు విభాగం భావించింది. 

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమషనరేట్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో (ఐటీఎంఎస్‌) అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోలింగ్‌ సిస్టం (ఏటీసీఎస్‌) విధానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. దీని కోసం గూగుల్‌ సంస్థతో పోలీసుశాఖ ఓ కీలక ఒప్పందాన్ని చేసుకుంది. 

కీలక మార్గాలు, జంక్షన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే పూర్తి సమాచారం గూగుల్‌ వద్ద రియల్‌ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఆ సంస్థ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడు తమ లొకేషన్‌ తెలుసుకోవడానికి అనుమతినిస్తారు. 

దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్‌ సంస్థకు కలుగుతోంది. ట్రాఫిక్ రద్దీ, జంక్షన్లు తదితర అంశాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ రహదారిలో, ఏ దిశలో సెల్‌ఫోన్లు ఎక్కువగా ఉన్నాయన్న సంగతిని గూగుల్ గుర్తిస్తోంది. 

రోడ్లపై ఉన్న సెల్‌ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే ఉంటాయి. ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్‌కు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్‌లో ట్రాఫిక్‌ రద్దీ ఉన్నరహదారుల్ని ఎరుపు రంగులో చూపుతూ ఉంటుంది. ప్రతి ట్రాఫిక్‌ జంక్షన్‌లోని నాలుగు రోడ్లలో ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్‌ లైట్, రెడ్‌ లైట్‌ వెలుగుతూ సిగ్నలింగ్ సైకిల్‌ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు.

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సైకిల్‌లో మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్‌ లైన్‌ పడిన రోడ్లు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్‌ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. వివిధ జంక్షన్లలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఓ జంక్షన్‌లోని నాలుగు రహదారుల్లో ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్‌ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్‌ సైకిల్‌లోనూ మార్పు తీసుకురావచ్చు.  

గూగుల్‌ వద్ద ఉన్న ఈ వివరాలను వాహన చోదకులు, ప్రజలకు ఉపయుక్తంగా వినియోగించాలని పోలీసు విభాగం భావించింది. దీంతో ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌తో కూడిన గూగుల్‌ సర్వర్‌తో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను కంట్రోల్‌ చేసే సర్వర్‌ అప్లికేషన్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ) ద్వారా అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ విషయమై గూగుల్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 

గూగుల్ సంస్థతో పోలీసు విభాగం ఒప్పందం అమల్లోకి రావడంతో గూగుల్‌ సర్వర్‌ ఆధారంగా ఓ జంక్షన్‌ సమీపంలోని రహదారుల్లో వాహనాల రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్‌ సిగ్నల్స్‌ సైకిల్‌ను మారుస్తుంది. దీంతో ఓ చౌరస్తాకు సంబంధించి రద్దీ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు గ్రీన్‌లైట్‌ వెలుగుతుంది. రద్దీని బట్టి ఆయా మార్గాల్లో సిగ్నల్స్‌ సైకిల్‌ను సర్వర్‌ మార్చేస్తూ ఉంటుంది.

అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోలింగ్‌ సిస్టంగా పిలిచే దీని ఫలితంగా ట్రాఫిక్‌ జామ్స్‌ తగ్గడంతోపాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని గచ్చిబౌలి చౌరస్తాలో ప్రయోగాత్మకంగా పరీక్షించి సక్సెస్ అయ్యారు. 

దీంతో మూడు కమిషనరేట్లలోని దాదాపు అన్ని జంక్షన్లలోనూ ఇదే పద్ధతిని వినియోగించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహిస్తున్న బెల్‌ సంస్థ కాంట్రాక్ట్‌ నవంబర్‌లో పూర్తయి కొత్త కాంట్రాక్ట్‌ మొదలవుతుంది. 

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఐటీఎంఎస్‌ ప్రాజెక్టు అదే సమయానికి మూడుు కమిషనరేట్లలోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ నుంచి ఐటీఎంఎస్‌లో భాగంగా ఏటీసీఎస్‌ విధానం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించనుంది.  

ఈ సందర్భంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ‘ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో అంతర్భాగంగా అమల్లోకి రానున్న అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోలింగ్‌ సిస్టంను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించాం. మంచి ఫలితాలు ఇస్తున్న ఈ విధానం ప్రజలకు, వాహన చోదకులకు ఉపయుక్తంగా మారుతుంది’ అని చెప్పారు.

ట్రాఫిక్ నియంత్రణ కోసం మౌలిక వసతుల కల్పన, ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ తదితరాల్లో ఉన్న ఇబ్బందుల్ని అధిగమిస్తున్నామని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ చెప్పారు. ‘త్వరలోనే ఏటీసీఎస్‌ను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నాం. గూగుల్‌ సంస్థ సహకారంతో ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉండే సర్వర్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది’ అని చప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios