న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ టెక్‌ మహింద్రా త్వరలో షేర్ల బైబ్యాక్‌ చేపట్టనున్నది. ఈ మేరకు గురువారం జరిగిన సంస్థ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రూ.950 చొప్పున వాటాదార్లకు ఇచ్చిన షేర్లను సంస్థ తిరిగి కొనుగోలు చేయనుంది.

‘రూ. 1,956కోట్లతో షేర్ల బైబ్యాక్‌ చేపడుతున్నాం. ఒక్కో షేర్‌కు రూ. 950 చొప్పున 2,05,85, 000 కోట్ల షేర్లను తిరిగి కొనాలని నిర్ణయించాం’అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెక్ ‌మహింద్రా తెలిపింది. ప్రస్తుతం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్‌ అవుతున్న కంపెనీ షేర్ల ధర కంటే కంపెనీ ప్రకటించిన బైబ్యాక్‌ షేర్ల ధర 14 శాతం ఎక్కువ. బైబ్యాక్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు వాటాదారుల అర్హతను వచ్చే నెల ఆరో తేదీ అని నిర్ణయించనున్నారు. అయితే బైబ్యాక్‌ ప్రొగ్రామ్‌ తేదీలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

నగదు నిల్వలు ఉన్న ఐటీ సంస్థలు డివిడెండ్, బైబ్యాక్‌ రూపేణా వాటాదార్లకు ప్రతిఫలాలను పంచుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్‌ ఇప్పటికే ఓ విడత బైబ్యాక్‌ను పూర్తి చేసుకోగా.. మరోసారి రూ.8,260 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో బైబ్యాక్‌ల సీజన్‌ సాగుతోంది. ఇప్పటికే 2019లో దాదాపు 25కంపెనీలు తమ షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు ప్రకటించాయి. ఇక 2018లో బైబ్యాక్‌ల మొత్తం విలువ రూ.54.5వేల కోట్లు. గత ఆరేళ్లలో ఇంత మొత్తంలో బైబ్యాక్‌లకు రావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ప్రకటించిన కంపెనీల్లో ఇన్ఫీ బైబ్యాక్‌ విలువే రూ.8.2వేల కోట్లు.

ముఖ్యంగా అదనపు నిధులను వాటాదారులకు అందజేయడానికి, డివిడెండ్లపై పన్నుభారం తగ్గించుకొనేందుకు బై బ్యాక్ వ్యూహం ఉపయోగపడుతుంది. దీంతోపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో షేర్ విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చిన్న కంపెనీలు తమ విలువ కాపాడుకునేందుకు బైబ్యాక్‌ల బాటపడుతున్నాయి. ఇదే సమయంలో కంపెనీ వ్యవస్థాపకులు భవిష్యత్‌పై ఆశావహ దృక్పథంతో ఉన్నారని ఈ బైబ్యాక్‌లు వెల్లడిస్తాయి. 

జనవరి ఒకటో తేదీ నుంచి మిడ్‌క్యాప్‌ కంపెనీల షేర్లు దాదాపు 10శాతం కుంగాయి. గత ఏడాది కోల్పోయిన విలువను కూడా కలుపుకొంటే ఈ మొత్తం భారీగానే ఉంటుంది. 2011 తర్వాత ఈ కంపెనీల షేర్ల విలువ ఇంతగా కుంగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా బైబ్యాక్‌లకు మొగ్గు చూపుతున్నాయి. కోల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఎండీసీ కంపెనీలు ఇప్పటికే బైబ్యాక్‌లను ప్రకటించాయి.