Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్‌టెల్‌ ఇక పరాధీన కంపెనీ: 51 శాతానికి సింగపూర్ సంస్థ వాటా?


ఎయిర్ టెల్ సంస్థ తన రుణ భారం తగ్గించుకోవడానికి తన వాటాలను విక్రయించడానికి పూనుకున్నది. ఎయిర్ టెల్ సంస్థలో సింగపూర్ టెలికం సంస్థ ‘సింగ్ టెల్’ 51వ శాతం వాటాలను కొనుగోలు చేయనున్నది. 

Singtel to raise holding in Bharti Telecom beyond 50%
Author
New Delhi, First Published Aug 9, 2019, 3:43 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్ టెల్‌లో సింగపూర్‌కు చెందిన ‘సింగ్ టెల్’ సంస్థ తన వాటా పెంచుకోనున్నది. 50 శాతానికి ఆ వాటా పెంచుకోవాలని తలపోస్తున్నది. అదే జరిగితే భారతీ ఎయిర్‌టెల్‌ విదేశీ కంపెనీ కావడంతోపాటు తొలిసారి భారత్‌లో ఒక విదేశీ కంపెనీ టెలికాం సేవలు అందిస్తున్నట్లు అవుతుంది.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) తెలిపిన సమాచారం ప్రకారం భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికాంకు 41 శాతం వరకు వాటా ఉంది. ప్రస్తుతం సునీల్‌ భారతీ మిట్టల్‌, ఆయన కుటుంబానికి భారతీ టెలికాంలో 52 శాతం వరకు వాటా ఉంది. 

‘అప్పుల నుంచి కొంత విముక్తి పొందడం కోసం ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్‌ (విదేశీ కంపెనీలతో పాటు), సింగ్‌టెల్‌ వాటాలు పెంచుకోవడానికి భారతీ టెలికాం వీలు కల్పిస్తోంద’ని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. 

‘విదేశీ వాటాలు కొంత పెరిగినా కూడా భారతీ టెలికాంలో విదేశీ పెట్టుబడులు 50 శాతానికి మించి పెరుగుతాయి. దాంతో అది విదేశీ కంపెనీ అవుతుంది. ఒక్కసారి అది జరిగితే.. భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికాంకు ఉన్న మొత్తం వాటా కూడా విదేశీ వాటా కింద పరిగణించాల్సి ఉంటుంది’ అని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

ప్రతిపాదిత సింగ్‌టెల్‌ పెట్టుబడులు పెట్టిన తర్వాత భారతీ ఎయిర్‌టెల్‌లో విదేశీ వాటాలు 43 శాతం నుంచి 85 శాతానికి పెరగనున్నాయి. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిని కోరుతూ భారతీ ఎయిర్‌టెల్‌ రెండో సారి దరఖాస్తు చేసింది. ఈ ఏడాది మొదట్లో భారతీ ఎయిర్‌టెల్‌ ఎఫ్‌డీఐ దరఖాస్తును టెలికాం విభాగం తిరస్కరించింది. విదేశీ పెట్టుబడుదారు విషయంలో స్పష్టత ఇవ్వలేదన్న కారణాన్ని అందుకు చూపింది.

ప్రతిపాదిత పెట్టుబడితో భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌ వాటా 52 శాతానికి చేరుతుంది. దీంతో మొత్తం మీద విదేశీయుల వాటా ప్రస్తుతమున్న 43 శాతం నుంచి 85 శాతానికి చేరుతుంది. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌కు 35 శాతం వాటా ఉంది. 2019 జూన్‌ 30 నాటికి భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర రుణం రూ.1,16,645.8 కోట్లుగా ఉంది. 
సింగ్‌టెల్‌ తాజా పెట్టుబడితో ఎయిర్ టెల్ ఆ రుణాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఏదైనా టెలికాం కంపెనీ తమ సంస్థలో విదేశీ పెట్టుబడులను 50 శాతానికి మించి పెంచుకోవాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) అనుమతులు అవసరం. రిలయన్స్‌ జియో రాకతో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌ యుద్ధంలో పాల్గొనాల్సి రావడం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios