న్యూఢిల్లీ: చైనా కంపెనీల నుంచి ప్రత్యేకించి ‘షియోమీ’ నుంచి వస్తున్న పోటీని ఢీ కొట్టేందుకు ‘ఎం’ గెలాక్సీ సిరీస్ ఫోన్లు తీసుకొచ్చిన శామ్‌సంగ్ ఆపర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. తాజాగా ఆ ఫోన్లలో ఎం30, ఎం20 ఫోన్లపై కంపెనీ డిస్కౌంట్‌ ప్రకటించింది. 

అటు శామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌తో పాటు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో రూ. 1000 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇటీవల అమెజాన్‌ వెబ్‌సైట్‌లో నిర్వహించిన ఫ్రీడమ్‌ సేల్‌లో అందించిన డిస్కౌంట్‌నే మళ్లీ అందిస్తున్నారు.

ఎం 20 మోడల్‌ ఫోన్‌ను శామ్‌సంగ్‌ ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చింది. తర్వాతీ నెలలో ఎం30 ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ఎం30 4జీబీ/ 64 జీబీ వేరియంట్‌ ధరను విడుదల సమయంలో 14,990గా పేర్కొనగా.. తాజాగా దాన్ని 13,990కి తగ్గించారు. 

ఇక 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను రూ.17,990 నుంచి రూ.16,990కి తగ్గించారు. ఎం20 మోడల్‌ 3జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ.10,990 నుంచి రూ.9,990కి తగ్గించారు. 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధరను రూ.12,990 నుంచి రూ.11,990కి తగ్గించారు.

వీటితో పాటు అమెజాన్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలుపై 5 డిస్కౌంట్‌ అదనంగా లభిస్తోంది. అటు అమెజాన్‌తోపాటు, శామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఎక్స్చేంజ్‌ వసతి కూడా లభిస్తోంది. శామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఎం10 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1000 తగ్గింపు అందిస్తోంది. రియల్‌మీ నుంచి రియల్‌మీ 5, 5 ప్రో, షియోమీ నుంచి ఎంఐ ఏ3 ఫోన్లు త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో శామ్‌సంగ్‌ ఈ ఫోన్లపై డిస్కౌంట్‌ ప్రకటించడం గమనార్హం.