న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం టెలికం రంగంలో సంచలనం నెలకొల్పింది రిలయన్స్ జియో. తాజాగా దాని అనుబంధ గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది.

ఎయిర్‌టెల్-వీ ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు తెలిపింది.  ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా ఆఫర్ లభిస్తుంది.
 
ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్‌లో ప్రస్తుతం 40 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 200 జీబీ డేటాను ఆరు నెలల కాలపరిమితితో ఇస్తున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
 
ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099లో ప్రస్తుతం 100 ఎంబీపీఎస్ వేగంతో 300 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 500 జీబీ డేటా ఆరునెలల కాలపరిమితితో లభిస్తుంది. 

వాయిస్ కాల్స్, ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ ప్రయోజనాలతోపాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
 
ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599లో ఇప్పటి వరకు 300 ఎంబీపీఎస్ వేగంతో 600 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడీ ప్లాన్‌తో అదనంగా 1000 జీబీ బోనస్ డేటా లభిస్తుంది. కాలపరిమితి 6 నెలలు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లో లభించే అన్ని ప్రయోజనాలు ఇందులోనూ లభిస్తాయి.

మరో బ్రాడ్ బాండ్ సంస్థ ‘టాటా స్కై’ ఇప్పటికే 18 నెలల అన్ లిమిటెడ్ ప్లాన్స్ వాడుకుంటున్న సబ్ స్కైబర్లకు మరో 12 నెలల అదనపు బ్రాడ్ బాండ్ సేవలు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. టాటా స్కై బ్రాడ్ బాండ్ వినియోగదారుడికి రూ.17,982 అన్ లిమిటెడ్ ప్లాన్‌తో ఫ్రీ రూటర్, ఫ్రీ ఇన్ స్టలేషన్, డేటా రోల్ ఓవర్, 10ఎంబీపీఎస్ డేటా స్పీడ్ అందిస్తుంది. 

రూ.35,082 చెల్లిస్తే 100 ఎంబీపీఎస్ డేటా స్పీడ్ కోసం టాటా స్కై 18 నెలల పాటు డేటా అందిస్తుంది. టాటా స్కై అదనంగా నాలుగు నెలలు, ఆరు నెలలు, ఎనిమిది నెలలు, 12 నెలల అన్ లిమిటెడ్ ప్లాన్లు అమలు చేసింది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే వర్తిస్తాయని టాటా స్కై తెలిపింది. వినియోగదారులు తమ ప్రాంతం టాటా స్కై ఎంపిక చేసిన సర్కిల్ పరిధిలో ఉందా? లేదా తెలుసుకోవాలని సూచించింది.