ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో దూకుడు కొనసాగుతూనే ఉంది. జూన్ నెలలో దాని ఖాతాదారుల సంఖ్య 82.6 లక్షలు పెరిగింది. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 41.75 లక్షల సబ్ స్క్రైబర్లను కోల్పోయాయని ట్రాయ్ పేర్కొంది.
న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో దూకుడు యధాతథంగా కొనసాగుతోంది. జూన్‌లో మరో 82.6లక్షల మంది జియో కనెక్షన్లు తీసుకున్నారు. అయితే అదే సమయంలో అగ్ర టెలికం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రం తమ చందాదార్లను కోల్పోతూనే ఉన్నాయి.
జూన్ నెలలో ఈ రెండు కంపెనీలు కలిసి 41.75లక్షల చందాదారులను కోల్పోయాయని ట్రాయ్ తెలిపింది.
వొడాఫోన్ ఐడియా నుంచి 41.45లక్షల మంది, ఎయిర్‌టెల్ నుంచి 29,883 మంది చందాదారులు మరో నెట్‌వర్క్‌కు మారారు. దీంతో జూన్ చివరి నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం చందాదారుల సంఖ్య 38.34కోట్లకు పడిపోయింది.
33.12 కోట్ల కనెక్షన్లతో జియో రెండో స్థానంలో ఉండగా.. ఎయిర్‌టెల్ 32.03 కోట్ల మంది చందాదారులతో మూడో స్థానానికి పడిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ లోపాలతో సతమతమవుతున్నా బీఎస్‌ఎన్‌ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతోంది. జూన్‌లో ఈ టెలికాం ఆపరేటర్‌కు కొత్తగా 2.66లక్షల మంది చందాదారులు చేరారు.
జియో రాకతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు వాటి నుంచి గట్టెక్కేందుకు.. ‘ప్రతినెలా కనీస రీఛార్జి చేసుకుంటేనే, ఇన్‌కమింగ్ సేవలు లభిస్తాయనే’ షరతు విధించాయి. దీంతో చందాదారులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంతో పోలిస్తే క్రమంగా ఆ నష్టం తగ్గినట్లు కన్పిస్తోంది. మే నెలలో వొడాఫోన్ ఐడియా 56.97 లక్షల చందాదారులను కోల్పోగా.. జూన్‌లో ఆ సంఖ్య 41.45లక్షలకు పరిమితమైంది. ఇక మేలో ఎయిర్‌టెల్ నుంచి 15.08లక్షల మంది వెళ్లిపోగా.. జూన్‌లో ఆ సంఖ్య 29,883కు తగ్గింది.
