OnePlus Nord CE 2 Lite 5G: స్మార్ట్ ఫోన్ ప్రియుల‌కు శుభ‌వార్త‌.. అతి త‌క్కువ ధ‌ర‌కే వన్ ప్ల‌స్‌..!

వన్ ప్లస్ ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌గా పేరుగాంచిన వన్ ప్లస్ నుంచి.. లో బడ్జెట్‌లో ఫోన్ రానుంది. రూ.19,999 ధరకు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ (OnePlus Nord CE 2 Lite 5G) మోడల్‌ ఫోన్‌ను ఇండియాలో వన్‌ప్లస్ కంపెనీ లాంఛ్ చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో నేటి నుంచి కొనుగోలు చేయవచ్చు.
 

OnePlus Nord CE 2 Lite 5G

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీంతో బడ్జెట్ 5జీ ఫోన్ల విభాగంలోకి కూడా వన్‌ప్లస్ అడుగు పెట్టింది. ఇక్కడ షియోమీ, రియల్‌మీ వంటి బ్రాండ్లకు పోటీని ఇవ్వనుంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ ధర

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వేరియంట్ ధరను రూ.21,999గా నిర్ణయించారు. బ్లాక్ డస్క్, బ్లూ టైడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి (శ‌నివారం) దీని సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా అధికారిక స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ ‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా.. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 50 శాతం చార్జింగ్ ఎక్కడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పట్టనుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా.. బరువు 195 గ్రాములుగానూ ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios