న్యూఢిల్లీ: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా నియంత్రణలోకి ‘పికప్‌.ఏఐ’ వచ్చి చేరింది. కృత్రిమ మేధ సేవలందించే బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌ను ఇందర్‌ సింగ్‌, రిత్విక్‌ శిఖ ప్రారంభించారు. ఈ కొత్త డీల్ ప్రకారం పికప్‌ బృందం ఓలాలో చేరనుంది. భవిష్యత్‌లో ఓలాను మరింత అభివృద్ధి చేసేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఓలా మిషిన్‌  లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, కృత్రిమ మేధ వంటి టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టడంలో ఇది కూడా ఒక భాగమన్నారు. 

ఈ ఏడాది ప్రారంభంలో శాన్‌ఫ్రాన్సిస్కో బేలో ఒక అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఓలా ప్రకటించింది. ‘దాదాపు వంద కోట్ల మందికి ప్రయాణ సౌకర్యాలను కల్పించే అంశంలో ఓలా ముందడుగు వేసింది. మేం భవిష్యత్ తరం టెక్నాలజీలపై దృష్టి సారించాం. పికప్‌.ఏఐ బృందాన్ని ఆహ్వానించేందుకు చాలా ఆతృతతో ఉన్నాం. మేం సంయుక్తంగా సృజనాత్మకంగా సాంకేతికతలను తయారు చేస్తున్నాం.’ అని ఓలా సీటీవో అంకిత్‌ భాతి తెలిపారు. 

స్టార్టప్ సంస్థలకు ఐటీ మినహాయింపు
స్టార్టప్‌లకు ఆదాయం పన్ను శాఖ కొంత ఉపశమనం కల్పించింది. మరికొన్ని సంస్థలకు ఏంజెల్‌ పన్ను నుంచి ఉపశమనం కల్పించేలా మినహాయింపును ఇచ్చింది. ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌లు కొన్ని నిబంధనల కింద ఈ మినహాయింపులు ఇచ్చాయి. 

దీని ప్రకారం ఫిబ్రవరి 19 కంటే ముందే అడిషనల్‌ అసెస్‌మెంట్‌ పూర్తి చేసుకొన్న సంస్థలకు మినహాయింపును ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వీటికి కూడా మినహాయింపులు ఇచ్చేందుకు అంగీకరించింది. అన్‌ లిస్టెడ్‌ కంపెనీలు సేకరించే మూలధనంపై విధించే పన్నును ఏంజెల్‌ ట్యాక్స్‌ అంటారు. 

వాస్తవంగా కంపెనీలు మూలధన సేకరణలో భాగంగా షేర్లను అధిక ధరకు విక్రయించడంతో ఆ లాభాలపై పన్ను విధిస్తుంటారు. గత వారం సీబీడీటీ అసెస్‌మెంట్‌ నిబంధనలను కొంత సడలించింది. గతంలో ఈ ఏంజెల్‌ ట్యాక్స్‌పై వివిధ స్టార్టప్‌లు ఆందోళన నిర్వహించడంతో ప్రభుత్వం మినహాయింపును ప్రతిపాదించింది.