దేశీయ సంస్థ మైక్రోమ్యాక్స్ (Micromax) నుంచి మరో బడ్జెట్ ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2సీ(Micromax In 2C) మొబైల్‌ భారత్‌లో లాంచ్ అయింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2సీ ధర, సేల్ పూర్తి స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూడండి. 

మొబైల్ తయారీదారు మైక్రోమ్యాక్స్ తాజాగా Micromax In 2c అనే బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ గతేడాది ప్రారంభించిన In 2b స్మార్ట్‌ఫోన్‌కు ఇది అప్ గ్రేడ్ వెర్షన్. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 అనే టాబ్లెట్ ఫోన్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

Micromax In 2c విషయానికి వస్తే ఇది ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ కాబట్టి ఇందులో ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల అదే స్థాయిలో ఉంటాయి. అయినప్పటికీ మార్కెట్లో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఫీచర్లను అందిస్తోంది. వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాలు, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫోన్ బ్యాటరీ 16 గంటల వీడియో స్ట్రీమింగ్ లేదా 50 గంటల టాక్ టైమ్‌ బ్యాకప్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ Infinix Hot 11, Realme C31 అలాగే Poco C3 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది. ఇంకా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ చూడండి.

Micromax In 2c స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.52 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేను మైక్రోమ్యాక్స్ ఇన్ 2సీ కలిగి ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 420 నిట్స్‌గా ఉంటుంది. ఈ బడ్జెట్ మొబైల్‌లో Unisoc T610 ప్రాసెసర్‌ ఉంది. గరిష్ఠంగా 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ మొబైల్‌ రన్ అవుతుంది.

Micromax In 2C వెనుక 8 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, మరో డెప్త్ సెన్సార్ ఉన్నాయి. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ 13 మెగాపిక్సెల్ కెమెరాతో ఉండగా.. ఊహించని విధంగా కొత్త మొబైల్‌ను తక్కువ సామర్థ్యమున్న కెమెరాతో మైక్రోమ్యాక్స్ తీసుకొచ్చింది. ఇక వీడియోకాల్స్, సెల్ఫీలు తీసుకునేందుకు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను Micromax In 2Cకు పొందుపరిచింది.

Micromax In 2C మొబైల్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. 10వాట్ల స్టాండర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ బరువు మొత్తంగా 198 గ్రాములుగా ఉంటుంది. ధర రూ. 8,499 అయితే ప్రారంభోత్సవ ఆఫర్ కింద వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో రూ. 7,499కే సొంతం చేసుకోవచ్చని మైక్రోమ్యాక్స్ తెలిపింది. Micromax In 2c బ్రౌన్, సిల్వర్ అనే 2 కలర్ ఛాయిస్‌లలో లభిస్తుంది. మైక్రోమ్యాక్స్ అధికారిక సైట్ అలాగే ఫ్లిప్‌కార్ట్ ద్వారా మే 1 నుంచి ఈ ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.