ముంబై‌: మూడేళ్ల క్రితం టెలికం సెక్టార్‌లో ఆరంగ్రేటంతోనే సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో త్వరలో బ్రాండ్‌ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ విషయమై ఫైబర్ బ్రాడ్ బాండ్ సర్వీసులు పలు నగరాల్లో ఇప్పటికే ప్రయోగాత్మక దశలో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది. 

వ్యాపార వర్గాలు తెలిపిన వివరాల మేరకు వచ్చేనెల 12వ తేదీ నుంచి రిలయన్స్‌ జియో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

‘ఫైబర్‌-టు-ది-హోం(ఎఫ్‌టీటీహెచ్‌) సేవలను అధికారికంగా ప్రారంభించే విషయమై వచ్చే నెలలో జరగనున్న సాధారణ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించే అవకాశం ఉంది’ అని ఆంగ్ల మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 

టెలికం రంగంలో మాదిరిగానే జియో గిగా ఫైబర్ రాకతో బ్రాండ్‌ సేవల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. 1 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న జియో ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకుంటే బ్రాడ్‌ బ్యాండ్‌తో పాటు, ల్యాండ్‌లైన్‌ సౌకర్యం కల్పిస్తోంది. త్వరలోనే టీవీ సేవలను సైతం ప్రారంభించనుంది. 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ వరకూ 90 రోజుల పాటు ఉచిత సేవలను పొందవచ్చు. 

బ్రాడ్ బాండ్ సేవల ఛార్జీలు ఏవీ వసూలు చేయబోమని, కానీ, సెక్యురిటీ డిపాజిట్ ‌(రిఫండబుల్‌) కింద రూ.4,500 కట్టాలని రిలయన్స్‌ చెబుతోంది. అధికారికంగా సేవలు ప్రారంభమైన తర్వాత నెలసరి కనీస ప్లాన్‌ రూ.600 ఉంటుందని అంటున్నారు.