చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం ‘హువావే’.. అమెరికా ఆంక్షలను అధిగమించేందుకు.. సెర్చింజన్ ‘గూగుల్’ను ఢీ కొట్టేందుకు సొంతంగా ‘హార్మనీ-ఓఎస్’ పేరిట ఆపరేటింగ్ సిస్టమ్ అభివ్రుద్ధి చేసుకున్నది. ఈ ఏడాది చివరికల్లా ఈ ఓఎస్ అందుబాటులోకి వస్తుందని హువావే ప్రకటించింది.
డాంగ్‌గువాన్: అమెరికా ఆంక్షలకు దీటుగా బదులిచ్చేందుకు చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజ సంస్థ హువావే సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను తయారుచేసుకుంది. శుక్రవారం జరిగిన హువావే డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
ఇంతకీ మరి దీనికి హువావే పెట్టిన పేరేంటో తెలుసా..? హార్మనీ-
ఓఎస్(Harmony- OS). ‘ప్రపంచంలోనే మరింత సామరస్యాన్ని తీసుకురండి’ అనేది ట్యాగ్‌లైన్.
అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో అతిపెద్ద టెలికం కమ్యూనికేషన్స్ సంస్థ హువావేను అగ్ర రాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. అయితే తర్వాత 90 రోజుల గడువు ఇచ్చారనుకోండి.
దీంతో హువావే ఫోన్లకు తమ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వబోమని గూగుల్ ప్రకటించింది. ఈ నెలాఖరు తర్వాత హువావే ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ సేవలు లభించవు. దీంతో గూగుల్ ఆండ్రాయిడ్‌కు పోటీగా హువావే సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను తయారుచేసేందుకు పూనుకుంది.
తొలుత ‘హాంగ్‌మెంగ్’ పేరుతో హువావే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తేనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘హార్మనీ-ఓఎస్’ పేరుతో ఆపరేటింగ్ సిస్టమ్‌ను కంపెనీ ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా హువావే కన్స్యూమర్ బిజినెస్ హెడ్ రిచర్డ్ యు మాట్లాడుతూ ‘ఇది భవిష్యత్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తొలి వెర్షన్‌ను ఈ ఏడాది చివరి నాటికి స్మార్ట్‌స్క్రీన్ ఉత్పత్తుల్లో అందుబాటులోకి తీసుకురానున్నాం. రానున్న మూడేళ్లలో మా అన్ని ఉత్పత్తుల్లో ఈ ఓఎస్‌ను తీసుకొస్తాం’ అని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొబైల్ కంపెనీలు గూగుల్ అందించే ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫాంపైనే మోడళ్లను తీసుకొస్తున్నాయి. చైనాకు చెందిన కొన్ని మొబైల్ సంస్థలకు సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా, ఆండ్రాయిడ్ వెర్షన్స్‌తో కలిపి వాటిని మొబైల్ ఫోన్లలో తీసుకొస్తున్నాయి.
చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు వాడే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను కస్టమైజ్డ్ ఓఎస్‌లు అంటారు. అయితే ఇప్పుడు హువావే పూర్తిగా ఆండ్రాయిడ్ ఆధారం లేకుండా సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్లను తీసుకొస్తే.. చైనా వెలుపల ఆ ఫోన్లకు గిరాకీ తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 10, 2019, 2:18 PM IST