చెన్నై: ఈనాటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో పలు రంగాలు.. ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’(ఐఓటీ) వ్యవస్థను అవలంబిస్తూ ఈజీగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇది సంతోషించే విషయమైనా.. సైబర్‌ నేరాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. భారత్‌లో గత కొంత కాలంగా సైబర్‌ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని.. అత్యధికంగా సైబర్‌ దాడులు జరిగిన దేశాల జాబితాలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సబెక్స్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

2019-20 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత్‌లో ఐఓటీ సెగ్మెంట్‌లో సైబర్‌ నేరాలు 22 శాతం మేర పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే కాలానికి సైబర్‌ నేరాల సంఖ్య 13 శాతం పెరిగినట్లు సబెక్స్‌ నివేదికలో వెల్లడైంది. అత్యధిక సైబర్‌ దాడులు జరిగిన దేశాల జాబితాలో వరుసగా రెండు త్రైమాసికాల్లో భాతత్‌ మొదటి స్థానంలో నిలవడం విశేషం. యూకే, ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన సెక్యూరిటీ సంస్థ సబెక్స్‌ తన ‘హనీపాట్‌’ నెట్‌వర్క్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 4000 ఐఓటీ పరికరాలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ సైబర్‌ దాడులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. వీటిలో 33,450 హైగ్రేడ్‌ సైబర్‌ దాడులు, 500 అధునాతన దాడులు జరిగినట్లు సబెక్స్‌ పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా 15 వేల సరికొత్త మాల్‌వేర్లను కూడా గుర్తించారు. 

సెంట్రల్‌ యూరప్‌లోని చెక్‌ రిపబ్లిక్‌, పోలాండ్‌ ప్రాంతాల నుంచి అత్యధిక సైబర్‌ దాడులు జరిగినట్లు నివేదికలో వెల్లడించారు. ‘స్మార్ట్‌ సిటీస్‌, ఆర్థిక సంస్థలు, రవాణా రంగాలకు చెందిన ఐఓటీ వ్యవస్థలపై ఈ దాడులు అత్యధికంగా జరిగాయి. మొత్తం సైబర్‌ దాడుల్లో ఈ మూడింటిలో జరిగినవే 51 శాతంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు అత్యధిక దాడులు జరిగిన నగరాల జాబితాలో ఉన్నాయి’ అని సబెక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ వినోద్‌ కుమార్ పేర్కొన్నారు.