Asianet News TeluguAsianet News Telugu

స్టార్టప్‌లకు బిగ్ రిలీఫ్: 10ఏళ్లకు.. రూ.25 కోట్ల వరకు నో టాక్స్

స్టార్టప్ సంస్థల టర్నోవర్‌పై విధించే ఏంజిల్ టాక్స్ విషయమై కేంద్రం మినహాయింపులు కల్పించింది. ఇంతకుముందు 10 కోట్ల పెట్టుబడి పరిమితిని రూ.25 కోట్లకు.. ఏడేళ్ల గడువును పదేళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీనిపై వచ్చేనెల స్టార్టప్ సంస్థల యాజమాన్యాలతో కేంద్రం సమావేశమై విధి విధానాలను రూపొందించనున్నది.

Govt relaxes norms for startups, raises investment limit for availing angel tax concession
Author
New Delhi, First Published Feb 20, 2019, 10:29 AM IST

న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు కేంద్రం గొప్ప ఊరటనిచ్చింది. వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు అద్దం పడుతున్న స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా నిర్ణయం తీసుకున్నది.

స్టార్టప్‌లకు ఏంజిల్‌ ట్యాక్స్‌ను మినహాయింపునిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. దీంతో షేర్‌ ప్రీమియంపై ట్యాక్స్‌ను చూసే పన్ను ఎగవేత చట్టాల నుంచి మినహాయింపు లభించనుంది. ఈ మార్పును సీబీడీటీ విడిగా నోటిఫై చేయనుంది.

ఆయా స్టార్టప్‌ల యాజమాన్యాలు తమ వాటాలు విక్రయించినప్పుడు ప్రీమియంలపై పన్నులు విధించడంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. స్టార్టప్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేలా ఏంజిల్ ట్యాక్స్ రాయితీ పరిమితిని గణనీయంగా పెంచింది.

స్టార్టప్‌ల్లో పెట్టుబడులు రూ.25 కోట్లు ఉన్నా ఏంజిల్ ట్యాక్స్ రాయితీని పూర్తిస్థాయిలో పొందేలా నిబంధనలను సవరించింది. ఇంతకుముందు ఏంజిల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.10 కోట్ల లోపు ఉంటేనే ఈ పన్ను రాయితీ లభించేది. ఇప్పుడు దీన్ని రూ.25 కోట్లకు పెంచినట్లు కేంద్రం తెలిపింది.
 
ఏంజిల్ ట్యాక్స్ నోటీసులతో తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని స్టార్టప్ నిర్వాహకులు తమ ఆందోళనను కేంద్ర ప్రభుత్వం ద్రుష్టికి తెచ్చారు. ఆదాయం పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 56 (2)(వీఐఐబీ) కింద ఈ నోటీసులు జారీ అవుతున్నాయి. 

పన్ను ఎగవేతలను అరికట్టడానికే తాము ఈ సడలింపులు తీసుకొచ్చామని కేంద్రం తెలిపింది. కాగా, మార్కెట్ విలువను మించి షేర్ల ప్రీమియం అందుకుంటే పన్నులను చెల్లిస్తున్న స్టార్టప్‌లకు తాజా నిర్ణయాలు పెద్ద ఉపశమనాన్నే కలిగిస్తాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. 

కాగా, స్థిరాస్తుల్లో, రవాణా వాహనాలపై రూ.10 లక్షలకు మించి పెట్టుబడులు ఉన్నా రుణాలు, అడ్వాన్సులు, ఇతర సంస్థలకు మూలధన పంపిణీ జరిగినా సెక్షన్ 56(2) కింద వచ్చే ప్రయోజనాలు రావు. కాగా, స్టాక్ మార్కెట్లలో లేని సంస్థలు షేర్ల జారీ ద్వారా సమీకరించే పెట్టుబడిపై చెల్లించాల్సిన ఆదాయం పన్నునే ఏంజిల్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు.

స్టార్టప్‌లకు పన్ను మినహాయింపునకున్న అమ్మకాల స్థాయినీ మూడింతలకు పెంచింది కేంద్రం. రూ.100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న స్టార్టప్‌లకూ ఇక పన్నుల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పన్నులశాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. 

స్టార్టప్ ప్రారంభమైనప్పటి నుంచి పదేళ్ల పాటు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ అమ్మకాలు రూ.100 కోట్లను మించరాదని, అప్పుడే ఈ పన్ను రాయితీల సదుపాయం ఉంటుందని కేంద్రం  స్పష్టం చేసింది.

ఇంతకుముందు స్టార్టప్‌ల అమ్మకాలు రూ.25 కోట్లను దాటితే పన్ను ప్రోత్సాహకాలుండేవి కావు. ఇక అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం గుర్తింపున్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా సదరు ఎంటర్‌ప్రెన్యూర్‌కు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.

స్టార్టప్ హోదా కాలాన్నీ పదేళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ప్రారంభమైన నాటి నుంచి పదేండ్ల వరకు స్టార్టప్‌గానే పరిగణిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మునుపు ఏడేండ్ల వరకే ఈ హోదా గడువుకాలం ఉండేది. 

ఇక అర్హత ఉన్న స్టార్టప్‌ల్లోకి స్టాక్ మార్కెట్లలోని రూ.100 కోట్ల విలువైన లేదా రూ.250 కోట్ల టర్నోవర్ గల సంస్థలు పెట్టే పెట్టుబడులకూ పన్ను రాయితీలు ఉంటాయని కేంద్రం తెలిపింది. పెట్టుబడులు రూ.25 కోట్లను దాటినా సెక్షన్ 56(2) నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నది. 

స్థానికేతరులు, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు-కేటగిరి 1 ద్వారా వచ్చిన పెట్టుబడులు కూడా రూ.25 కోట్లను మించినా పన్ను మినహాయింపులు ఉంటాయి.వచ్చే నెల ఒకటో తేదీన స్టార్టప్‌లతో డీపీఐఐటీ సమావేశం కానున్నది. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ, పెట్టుబడులను ఆకట్టుకునేందుకు అవలంభించాల్సిన మార్గాలపై చర్చిస్తామని కేంద్ర అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ మీడియాకు తెలిపారు. 

దేశంలో స్టార్టప్‌లను మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన చర్యలపైనా చర్చిస్తామని కేంద్ర అంతర్గత వాణి జ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ చెప్పారు. వివిధ దేశాల్లోని మదుపరులను భారతీయ స్టార్టప్‌ల్లోకి ఏంజిల్ ఇన్వెస్టర్లుగా తేవడానికి ప్రభుత్వం మద్దతునిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

స్టార్టప్‌లకు అండగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు చాలా బాగున్నాయని పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. స్టార్టప్‌ల విస్తరణకు కేంద్రం ఊతమిచ్చిందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. యువ ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఎంతో లాభమని ఇండియన్ ఏంజిల్ నెట్‌వర్క్ సహ వ్యవస్థాపకురాలు పద్మజ అన్నారు. భారత్ స్టార్టప్ నేషన్‌గా అవతరించడానికి అనువైన నిర్ణయాలివని పేర్కొన్నారు.

తాజాగా కేంద్రం నిర్ణయాలు స్టార్టప్‌లకు నిధుల కొరత తీర్చగలవని, పెట్టబడిదారులను సృష్టించగలవని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా పేర్కొన్నారు. కొత్తవారికి ఊతమిస్తూ స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు అందరినీ ఆకర్షితుల్ని చేసేలా సర్కారు నిర్ణయాలు ఉన్నాయని కొనియాడారు.

ఏంజిల్ ట్యాక్స్ మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల విదేశీ మదుపరులూ భారతీయ స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ముందుకొస్తారని టై-ఢిల్లీ ఎన్‌సీఆర్ చైర్మన్ ఎమిరేట్స్ సౌరభ్ శ్రీవాత్సవ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌కు చెందిన నాలుగు ఈ-లెర్నింగ్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్‌లు ప్రపంచ స్థాయిలో పోటీపడుతున్నాయి. నెక్స్ బిలియన్ ఎడ్‌టెక్ బహుమతి కోసం పోటీపడుతున్న 30 అంతర్జాతీయ స్టార్టప్‌ల్లో నాలుగు భారతీయ స్టార్టప్‌లూ ఉన్నాయి. ఈ విజేతను వచ్చే నెలలో ప్రకటించనున్నారు. కాగా, ఆ నాలుగింటిలో ఆగ్మెంటెడ్ లెర్నింగ్, అవేటి లెర్నింగ్, ఉత్తర్, దోస్త్ స్టార్టప్‌లున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios