యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్: మరో దఫా ఫేస్‌బుక్‌కు తప్పని విచారణ
సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ మరో దఫా యాంట్రీ ట్రస్ట్ కేసు విచారణను ఎదురోనున్నది. మరోవైపు టిండర్ కు పోటీగా ‘సీక్రెట్ క్రష్’ పేరిట మరో ఫీచర్ ను ఫేస్ బుక్ యూజర్ల ముందుకు తెచ్చింది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి విచారణను ఎదుర్కోనున్నది. మార్కెట్‌లో నూతన సంస్థల పోటీని ఎదుర్కోవడానికి వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందన్న అభియోగం నేపథ్యంలోనే విచారణ కొనసాగనున్నదని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తెలిపారు.
అమెరికా ఫెడర్ కమిషన్ దర్యాప్తును ఎదుర్కొన్న ఫేస్ బుక్
ఫేస్‌బుక్ గతంలో అమెరికా ఫెడరల్ కమిషన్ దర్యాప్తును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద సంస్థ అయినా చట్టాన్ని గౌరవించాల్సిందేనని, అయితే ఈ అంశంపై ఫేస్‌బుక్ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం అని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ అన్నారు.
సమాచార భద్రతపైనే విచారణ కేంద్రీకరణ
‘ముఖ్యంగా మా విచారణలో వినియోగదారుల సమాచార భద్రత, ప్రకటనల ధరల పెంచడానికి కారణాలను విశ్లేషించనున్నాం’ అని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొలరాడో, ఫ్లోరిడా, అయోవా, నెబ్రాస్కా, నార్త్ కరోలినా, ఒహియో రాష్ట్ర అధికారులు దర్యాప్తులో తమ వంతు కీలక పాత్ర పోషించనున్నారని ఆమె తెలిపారు.
గుత్తాధిపత్యానికి సారథ్యం వహించమని ఫేస్ బుక్ ఇలా
గతంలో ఫేస్‌బుక్ స్పందిస్తూ ఎవరిపైనా గుత్తాధిపత్యం చేయబోమని ఆన్‌లైన్‌లో తమ స్నేహితులను ఏ విధంగా కలుసుకోవాలనేది వినియోగదారుల స్వేచ్చ మేరకే ఆధారపడి ఉంటుందని ఫేస్‌బుక్ స్పష్టం చేసిన విషయం విదితమే.
ఫేస్‌బుక్‌లో ‘సీక్రెట్ క్రష్’ ఫీచర్
‘ఫేస్‌బుక్’ అమెరికా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘సీక్రెట్ క్రష్ (రహస్య ప్రేమ)’ పేరిట డేటింగ్ వేదికను తీసుకొచ్చింది. ఈ ఫ్లాట్‌ఫామ్‌పై తమ ఇష్టాయిష్టాలను నిర్భయంగా పరస్పరం పంచుకోవచ్చు. తమ మిత్రుల మిత్రులను కూడా దీని ద్వారా పరిచయం చేయవచ్చు. వారి వివరాలను కూడా ఈ కొత్త ఫీచర్‌లో పొందుపర్చవచ్చు. దీనికి ఫేస్‌బుక్ యూజర్లతోపాటు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను, ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలను కూడా అనుసంధానించవచ్చు.
‘టిండర్’కు పోటీగా ‘సీక్రెట్ క్రష్
‘టిండర్’ అనే డేటింగ్ వెబ్‌సైట్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్ గురువారం నుంచే అమెరికా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇతర డేటింగ్ సైట్లలాగా ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి పరస్పరం ‘మ్యాచ్’ కావాల్సిన అవసరం లేదు. ఫ్రొఫైల్‌ను లైక్ చేసి, ఫొటోపై వాఖ్యానం చేయడం ద్వారా ‘సీక్రెట్ క్రష్’తో ఒకరికొకరు సంధానం కావచ్చు.
తొమ్మిది మంది యూజర్లతో ఒకేసారి కనెక్ట్ కావచ్చు ఇలా
ఈ కొత్త ఫీచర్‌లో ఒక్కరు తొమ్మిది మంది ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లతో కనెక్ట్ కావచ్చు. తద్వారా వారి మిత్రులే కాకుండా మిత్రుల మిత్రుల ప్రొఫైల్స్‌ను కూడా షేర్ చేసుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. ఎదుటి వారు నచ్చని పక్షంలో సింపుల్‌గా ఇంటూ మార్క్‌ను క్లిక్ చేసి ముందుకు పోవచ్చు.
ఇలా యూజర్లతో సీక్రెట్ క్రష్ తో ఫోటోల షేరింగ్
ఓ యూజర్‌కు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నిక్షిప్తం చేసిన సమాచారం, ఫొటోలను నేరుగా ఈ ‘సీక్రెట్ క్రష్’పైకి తీసుకొచ్చి మిత్రులతో షేర్ చేసుకకోవచ్చు. నిజంగా డేటింగ్ చేయాలనుకుంటున్న వారి జాబితానూ ఇందులో ‘సీక్రెట్’గా దాచుకోవచ్చు. యూజర్ల వ్యక్తీకరణ, గోప్యతను ఈ ‘సీక్రెట్ క్రష్’ సమతౌల్యం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఫేస్‌బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలు యూజర్ల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించలేక పోతున్నాయంటూ ఇటీవల ఎక్కువగా విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.