ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కి కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సోషల్‌మీడియా యాప్‌లో మరో బగ్‌ను గుర్తించారట. అది యూజర్ల బ్లాక్‌ లిస్ట్‌ను తాత్కాలికంగా అన్‌బ్లాక్‌ చేసినట్లు ఫేస్‌బుక్‌ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ ఎరిన్‌ ఎగాన్‌ ఓ పోస్టులో తెలిపారు.

సాధారణంగా ఖాతాను అనుసరిస్తున్న స్నేహితులను బ్లాక్‌ చేసుకునే సదుపాయం యూజర్లకు ఉంటుంది. దానికి కారణాలేవైనా ఉండొచ్చు. అయితే ఈ బగ్‌ యూజర్ల బ్లాక్‌ లిస్ట్‌ను పొరబాటుగా అన్‌బ్లాక్‌ చేసినట్లు ఎరిన్‌ తెలిపారు.

దాదాపు 8 లక్షల మందికి పైగా యూజర్లు ఈ బగ్‌ బారిన పడినట్లు సమాచారం. ని బారిన పడిన వారిలో ఫేస్‌బుక్‌ యాప్‌ యూజర్లు, మెసేంజర్‌ యాప్‌ యూజర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ఈ బగ్‌ యాక్టివ్‌లో ఉందని ఫేస్‌బుక్‌ ధృవీకరించింది. ఎవరినైనా బ్లాక్‌లో పెట్టే సామర్థ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదని ఫేస్‌బుక్‌ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ ఎరిన్‌ ఇగాన్‌ చెప్పారు. 

బ్లాక్‌ చేసిన వారి ప్రొఫైల్‌ చూడకుండా ఉండే సౌకర్యాన్ని ఫేస్‌బుక్‌ కల్పిస్తోంది. ఒక ఫ్రెండ్‌గా కనెక్ట్‌ అయిన తర్వాత, వారి ప్రవర్తన నచ్చకపోతే వారిని ఆటోమేటిక్‌గా ‘అన్‌ఫ్రెండ్స్‌’ లో పెట్టేయొచ్చు.  ఒక యూజర్‌ను మరో ఫేస్‌బుక్‌ యూజర్‌ బ్లాక్‌లో పెట్టడానికి చాలా కారణాలుంటాయని ఇగాన్‌ తెలిపారు. వారి మధ్య సంబంధాలు తెగిపోవడం లేదా నచ్చని కంటెంట్‌ను వారు పోస్టు చేస్తూ ఉండటం ఇలాంటి పలు కారణాలతో ఫేస్‌బుక్‌ యూజర్లను బ్లాక్‌ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. 

వేధింపుల కారణంతో కూడా కొంతమంది యూజర్లను బ్లాక్‌ చేస్తుంటారని తెలిపింది. 8 లక్షల మందికి పైగా యూజర్లు దీని బారిన పడ్డారని, ఈ బగ్‌ ప్రభావితమైన యూజర్లకు నోటిఫికేషన్లు వస్తాయని కంపెనీ తెలిపింది. నోటిఫికేషన్‌ వచ్చిన అనంతరం బ్లాక్డ్‌ జాబితాను యూజర్లు ఒక సారి చెక్‌ చేసుకోవాల్సిందిగా సూచించింది