టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఐఎన్‌సీ వర్చువల్‌ క్రెడిట్‌ కార్డులు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. గోల్డ్‌మన్‌ శాక్స్‌  గ్రూప్‌తో కలిసి ఆపిల్ వీటిని ప్రారంభించింది. ఇది ఐఫోన్‌కు యాడ్‌ ఆన్‌ రూపంలో లభించనుంది. ఫోన్ల విక్రయాల నుంచి కొంచెం భిన్నంగా ఆపిల్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించడం విశేషం. 

వినియోగదారుల సౌకర్యార్థం వర్చువల్ ‘క్రెడిట్ కార్డు’ను ఈ కార్డును ప్రారంభించనున్నట్లు మార్చిలో నిర్వహించిన ఎర్నింగ్‌ కాల్‌లో ఆపిల్‌ కార్డ్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో  కొందరు ఎంపిక చేసిన వినియోగదారులు నేటి నుంచి  దీనిని ఉపయోగించే అవకాశం కల్పించారు. ఎంతమందికి అవకాశం కల్పించారో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఎంపిక చేసిన వారిని ఆహ్వానించి మరీ అందజేయనున్నది ఆపిల్. మంగళవారం నుంచి వీరికి ఇన్విటేషన్లు వెళ్లనున్నాయి. 

ఈ కార్డు వినియోగించాలంటే మాత్రం వినియోగదారుడి ఫోన్‌లో 12.4 ఐవోఎస్‌ ఉండాల్సిందే. దీనిలో మీ చిరునామా, ఆదాయపు వివరాలు, పుట్టిన రోజు, సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌ (అమెరికాలో) చివరి నాలుగు అంకెలను యాప్‌లో నమోదు చేయాలి. ఇవి గోల్డ్‌మన్‌ శాక్స్‌కు వెళతాయి. ఆ సంస్థ కార్డు దరఖాస్తును స్వీకరించడమో.. తిరస్కరించడమో చేస్తుంది. కేవలం నిమిషంలోపే ఈ సంగతి తేలిపోతుంది. 

కార్డు జారీ అయితే వెంటనే మీ ఆపిల్‌ వాలెట్‌లో అది ప్రత్యక్షం అవుతుంది. అవసరమైతే ఈ కార్డు సెటప్‌ చేసుకొనే సమయంలో ఆపిల్‌ ఫ్యాన్సీ టైటానియం కార్డును కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  అది తర్వాత మీ ఈ-మెయిల్‌కు వస్తుంది. ఈ కార్డులో ఎన్‌ఎఫ్‌సీ ట్యాగ్‌ ఉండటంతో ఒకసారి ట్యాప్‌ చేసి వినియోగించుకోవచ్చు.

దీంతో పాటు ఆపిల్‌ మరో భౌతికంగా ఒక కార్డును కూడా జారీ చేయనుంది. దీనిలో కార్డునెంబర్లు మొత్తం ఒక చిప్‌లో నిక్షిప్తం చేసి ఉంచుతారు. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను రక్షించేందుకే యాపిల్‌ ఈ కార్డులను ప్రవేశపెట్టింది. వినియోగదారుల లావాదేవీలు మొత్తం ఐఫోన్‌లోనే నిక్షిప్తం అవుతాయి. వీటిని  వ్యాపార అవసరాల నిమిత్తం గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఎవరికీ ఇవ్వదు.