Asianet News TeluguAsianet News Telugu

భద్రతా లోపాలు కనిపెడితే పది లక్షల డాలర్లు గిఫ్ట్.. ఇదీ ఆపిల్ ఆఫర్

తమ ఐఫోన్లలో భద్రతా లోపాలు కనిపెడితే పది లక్షల డాలర్ల బహుమతి (బౌంటీ) అందజేస్తామని ఆపిల్ ప్రకటించింది. 

Apple offers record 'bounty' to researchers who find iPhone security flaws
Author
New York, First Published Aug 10, 2019, 2:25 PM IST

న్యూయార్క్: ఐ ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్‌ పరిశోధకుల కోసం భారీ బహుమతిని ప్రకటించింది. సైబర్‌ నేరాలు, హ్యాకింగ్‌కు అవకాశం కల్పించే లోపాల్ని గుర్తించిన వారికి పది లక్షల డాలర్లను బహుమానంగా అందిస్తామని ప్రకటించిందిది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొడుతున్నాయని వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

గతంలో కొంత మంది నిర్దేశిత పరిశోధకులకు మాత్రమే ఈ బహుమతి అందించేవారు. కానీ, ఇక నుంచి లోపాల్ని కనుగొనే ప్రక్రియను అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచనున్నట్లు రెండు రోజుల క్రితం లాస్‌వెగాస్‌లో జరిగిన బ్లాక్‌ హ్యాట్‌ సెక్యూరిటీ సదస్సులో యాపిల్‌ ప్రకటించింది. ఐఫోన్‌తో పాటు మ్యాక్ సాఫ్ట్‌వేర్‌, ఇతర యాపిల్‌ ఉత్పత్తుల్లో హ్యాకింగ్‌ అవకాశం కల్పించే లోపాల్ని కనుగొన్న వారికి ఈ బహుమానం లభిస్తుందని తెలిపింది. 

ఈ బహుమతిని ఆపిల్ బౌంటీగా పేర్కొంది. అయితే వినియోగదారుడి నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఫోన్‌లోకి ప్రవేశించే లోపాలను కనుగొన్న వారికి మాత్రమే ఈ బహుమానం వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటివరకు చిన్నపాటి బగ్స్‌ కనుగొన్నవారికి యాపిల్‌ 20వేల డాలర్లు అందిస్తూ వచ్చింది. 

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్న తరుణంలో యాపిల్‌ పలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అలాగే లోపాల్ని పరిశోధించే ప్రక్రియల్ని సైతం సులభతరం చేస్తోంది. అందులో భాగంగా భద్రతా ప్రమాణాల్ని తొలగించిన ఫోన్లను పరిశోధకులకు అందజేస్తోంది. దీని ద్వారా హ్యాకర్లకు అనుకూలించే లోపాల్ని పసిగట్టే అవకాశం ఏర్పడుతుంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పలు దేశాలు అత్యాధునిక హ్యాకింగ్‌ టెక్నాలజీని సమకూర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్‌ ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios