డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ప్రకారం, ఉద్యోగాలు పోవడం కంటే ఏఐ చెడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడమే పెద్ద ముప్పు. దుర్వినియోగాన్ని అడ్డుకోవడం అత్యవసరమని ఆయన అన్నారు.

ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతపై విస్తృతంగా చర్చలు జరుగుతున్న వేళ, గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలు ఉన్నా, అసలైన ప్రమాదం అది కాదని స్పష్టం చేశారు.

చెడు ఉద్దేశాలున్న…

డెమిస్ అభిప్రాయం ప్రకారం, కృత్రిమ మేధ మానవ ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న విషయం తాను పెద్దగా భయపడేది కాదట. కానీ ఈ శక్తివంతమైన టెక్నాలజీ చెడు ఉద్దేశాలున్న వ్యక్తుల చేతుల్లోకి వెళితే, దాని వలన సమాజానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ తరహా వ్యక్తులకు ఏఐ యాక్సెస్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశాల మధ్య సన్నిహిత సహకారం..

కేవలం ఉద్యోగాల కోణంలో కాకుండా, సమాజంపై దీని ప్రభావాన్ని సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని డెమిస్ సూచించారు. ప్రస్తుతం ప్రపంచంలోని భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల సమయంలో ఏఐ వృద్ధి వేగంగా జరుగుతోందని, అలాంటి పరిస్థితుల్లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు దేశాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని తెలిపారు.

కొత్త రకమైన ఉద్యోగాలు…

ఏఐ వలన ప్రధానంగా ఎంట్రీ లెవల్ వైట్-కాలర్ ఉద్యోగాలు తగ్గుతాయని, కారణం – సాధారణ పనులను ఇప్పుడు యాంత్రికంగా చేయగలిగే టూల్స్ అందుబాటులోకి రావడమే అని వివరించారు. అయితే దీని వలన మానవ శక్తి మరింత సృజనాత్మక, నైపుణ్యంతో కూడిన పనులవైపు దృష్టి పెట్టే అవకాశముందన్నారు. దీని వలన కొత్త రకమైన ఉద్యోగాలు కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ శక్తిని ఉపయోగించుకునే విధానం మనపై ఆధారపడి ఉందని స్పష్టంగా తెలిపారు. ఏఐను మంచికే వినియోగిస్తే ఇది ప్రపంచానికి మేలు చేస్తుందని, లేకపోతే దుర్వినియోగమైతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.