Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్-పే కొత్త ఫీచర్...త్వరలో అందుబాటులోకి...

2018 ఫిబ్రవరిలోనే వాట్సాప్-పే ఫీచర్ పైలట్ ప్రాజెక్టుగా దేశంలో అమలు చేసినా.. పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. దీనికి వాట్సాప్ యాజమాన్యం.. ఆర్బీఐ రూపొందించిన నిబంధనలను పూర్తిస్థాయిలో అమలులోకి తేలేదు. ఈ నెలాఖరు నాటికి వాట్సాప్-పే డిజిటల్ చెల్లింపులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. 

WhatsApp Pay service may launch by this month's end
Author
Hyderabad, First Published May 6, 2020, 11:02 AM IST

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తో సందేశాలు, వీడియోలు, డాక్యుమెంట్లు తదితరాలు పంచుకోవచ్చు. అయితే, వాట్సాప్ వినియోగదారులను ఎంతో కాలంగా ఊరిస్తున్న ఫీచర్ వాట్సాప్ పే. రెండేళ్లుగా భారతదేశంలో వాట్సాప్ పే బీటా టెస్టింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు కారణాల వల్ల ఈ వసతి అధికారికంగా అందుబాటులోకి రాలేదు.

తాజాగా అందిన నివేదిక ప్రకారం ఈ నెలాఖరు నాటికి వాట్సాప్-పే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల సాయంతో వాట్సాప్-పే ఫీచర్ అందుబాటులోకి తేనున్నది. ఇక ఇప్పటికైతే దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సేవలందించడానికి ముందుకు రాలేదు. ఎస్బీఐ రంగంలోకి రావడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విధించిన నియమ, నిబంధనల వల్లే ఇప్పటి వరకు వాట్సాప్ -పే ఫీచర్ అధికారికంగా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఆర్బీఐ నియమ నిబంధనలన్నీ వాట్సాప్ పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. మరోవైపు దేశమంతటా ఒకేసారి వాట్సాప్-పే ఫీచర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే బ్యాంకులపై భారం పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

also read ఆర్‌బి‌ఐ మరో కీలక నిర్ణయం.. కాంటాక్ట్ ఫ్రీ పేమెంట్స్ కి గ్రీన్ సిగ్నల్ ..

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దశల వారీగా వాట్సాప్-పే ఫీచర్ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని వాట్సాప్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఫేస్ బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్‌కు భారతదేశంలో 40 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 2018 ఫిబ్రవరి నుంచి వాట్సాప్-పే సేవలను అందుబాటులోకి తెచ్చింది. 

ఇది పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువస్తే మరింత విజయం సాధిస్తామని వాట్సాప్ యాజమాన్యం భావిస్తోంది. దీన్ని వినియోగించడం కూడా సులభతరమేనని చెబుతున్నది. కేవలం, చెల్లింపుల కోసం ప్రత్యేకంగా మరో యాప్ వినియోగించాల్సిన అవసరం లేదని వాట్సాప్ అంటున్నది. 

పూర్తిస్థాయిలో వాట్సాప్-పే సేవలు అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయని వాట్సాప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రస్థానంలో ఉన్న గూగుల్ పే, పేటీఎంలకు వాట్సాప్-పే గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios