న్యూఢిల్లీ: భారత ఈ-కామర్స్‌ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్‌ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సిద్ధమైంది. దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వాల్‌మార్ట్‌ సన్నద్ధమైంది.

ఫ్లిప్‌కార్ట్‌లో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వాల్‌మార్ట్ తెలిపింది. రెండేళ్ల క్రితం 1600 కోట్ల డాలర్ల విలువైన మెజారిటీ వాటాను 24.9 బిలియన్‌ డాలర్ల పోస్ట్‌ మనీగా వాల్‌ మార్ట్‌ కొనుగోలు చేసింది. అప్పుడు ఫ్లిప్‌కార్ట్ విలువ 2080 కోట్ల డాలర్లుగా ఉంది. ఫ్లిప్ కార్ట్ సంస్థలో 80కి పైగా క్యాటగిరీల్లో 15 వేలకు పైగా ఉత్పత్తులు లభ్యం అవుతున్నాయి. 

దేశంలోని 20 కోట్ల దుకాణదారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. దేశంలో ఈ-కామర్స్ రంగాన్ని విస్తరించేందుకు పూనుకున్నామని చెప్పారు. రిటైల్‌ రంగంలో దూసుకుపోతున్న జియోమార్ట్‌ సంస్థను ఎదుర్కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులను సమీకరించడానికి మరింతగా పెంచుకుంటోంది.

also read రిలయన్స్ వార్షిక సమావేశం: జియో ఫోన్ 3పై వీడనున్న సస్పెన్స్? ...

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా భారత్ ఉన్నది. కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకునేందుకు చర్యలు ప్రారంభించడంతో దేశంలోని తన ఈ-కామర్స్ మార్కెట్‌ను మరింతగా పెంచుకోవడానికి తాజా మూలధనం సహాయపడుతుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. 

అయితే, ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సంస్థలో పెట్టుబడులకు తాజాగా వాల్ మార్ట్ పెట్టుబడులు అదనం అని తెలిపింది. ఫ్లిప్ కార్ట్ సంస్థ 2007లో స్థాపించారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో మైంత్రా, ఈ-కార్ట్, డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ఫోన్ పే భాగస్వాములుగా ఉన్నాయి. ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోకి విస్తరణే లక్ష్యంగా ఫ్లిప్ కార్ట్ దూసుకెళ్తున్నది.

వాల్‌మార్ట్ ప్రత్యర్థి సంస్థగా నిలిచిన జియోమార్ట్ సంస్థలో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాతో 5.7 బిలియన్ల డాలర్ల  పెట్టుబడులు పెట్టింది. జియో ఫ్లాట్ ఫామ్స్‌లో అమెరికా ఈక్విటీ జెయిట్ సిల్వర్ లేక్ పార్టన్స్ 750 మిలియన్ల డాలర్లు, విస్టా ఈక్విటీ పార్టనర్స్ 150 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.