ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (ఏజీఎం) బుధవారం జరగనుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్‌ తొలిసారిగా వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నది.

రిలయన్స్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఏజీఎంలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని మార్గెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. ఈ వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3ని ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇంతకుముందు 2017లో జరిగిన 40వ రిలయన్స్ వార్షిక సమావేశంలో జియో-1 ఫీచర్ ఫోన్‌ను ముకేశ్ అంబానీ ఆవిష్కరించారు. 2018లో 41వ వార్షిక సమావేశంలో జియో-2 ఫీచర్ ఫోన్ విపణిలోకి విడుదల చేశారు. 

జియో ఫోన్-3 గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకూ ఈ ఫోన్ ఫీచర్లు గానీ, ధర గురించి గానీ స్పష్టత రాలేదు. గత సంప్రదాయం ప్రకారం బుధవారం జరిగే సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలోనే జియో-3 ఫోన్ ఆవిష్కరిస్తారని వార్తలు వెలువడ్డాయి. 

also read రిలయన్స్ జియోతో గూగుల్‌ భారీ డీల్..త్వరలో అధికారిక ప్రకటన.. ...

మీడియా టెక్ చిప్ సెట్, గూగుల్ ఆధారిత కైఓఎస్ విత్ 4జీ కనెక్టివిటీతో జియో-3 ఫోన్ విపణిలోకి వస్తుందని సమాచారం. కానీ మీడియా టెక్ సంస్థ మాత్రం అటువంటిదేమీ లేదని నిరాకరించింది. ఎటువంటి వివరాలు వెల్లడించడానికి రిలయన్స్ తిరస్కరించింది. 

2016లో భారత టెలికం రంగంలో సంచలనాలు నెలకొల్పిన రిలయన్స్ జియో.. ప్రస్తుతం దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థగా నిలిచింది. అంతేకాదు రిలయన్స్ సంస్థను రుణాల నుంచి విముక్తి కలిగించడంలో జియో కీలకంగా వ్యవహరించింది. 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, టెక్ దిగ్గజం ఇంటెల్ ఈక్విటీతోపాటు సావరిన్ సంస్థలు, టెక్ దిగ్గజ సంస్థలు జియో ప్లాట్ ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. తాజాగా సెర్చింజన్ ‘గూగుల్’ కూడా జియోలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయా? అన్న వార్తలు వెలువడ్డాయి.