ముంబై: సరిహద్దుల్లో దురాక్రమణకు పాల్పడటంతోపాటు 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చైనా దుందుడుకు తనానికి అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టిక్ టాక్‌తోపాటు 59 చైనా యాప్స్‌ను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.

తాజాగా చైనాలో తయారు చేసిన ‘5జీ’ పరికరాలను కూడా నిషేధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన కేంద్ర మంత్రుల కీలక భేటీలో ఈ అంశంపై చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.

వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, గోప్యతకు భంగం కలుగుతోందని, సమాచారం చైనా సర్వర్లలోకి చేరుతున్నదని సోమవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్స్ మీద నిషేధం విధించింది. వాస్తవంగా ఇప్పటికే 5జీ స్పెక్ట్రం వేలం పూర్తి కావాల్సి ఉంది.

కానీ కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు అది కనీసం ఏడాది వరకు వాయిదా పడింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల కారణంగా వొడాఫోన్, ఐడియా వంటి టెలికం సంస్థల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటం కూడా దీనికి దోహదపడింది. అయితే దేశీయంగా 5జీ సేవలను అందుబాటులోకి తేవాలంటే ‘హువావే’ కీలక పాత్రధారి కానున్నదని సమాచారం.

also read చైనా యాప్స్ నిషేధంపై మీరు తెలుసుకోవాల్సిన విషయాలు...

ఇప్పటికే చైనాకు చెందిన హువావేను అమెరికా నిషేధించింది. హువావే సంస్థ అధినేతకు, చైనా కమ్యూనిస్టు పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉండటమే దీనికి కారణం అన్న అభిప్రాయాలు ఉన్నాయి. హువావేపై మరికొన్ని ఆరోపణలు రావడంతో డొనాల్డ్ ట్రంప్.. దానిని నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 

బ్రిటన్, భారత్ సైతం ఇలాంటి చర్యలే తీసుకోవాలని అమరికా కోరింది. కాగా, 4జీ వినియోగంలో చైనా పరికరాలను వాడవద్దని ఇంతకుముందు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 5జీ పరికరాల వాడకాన్ని నిషేధిస్తే ప్రైవేట్ ఆపరేటర్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇప్పటికే ఎయిర్ టెల్, రిలయన్స్ జియో.. 5జీ సేవలను అందుబాటులోకి తేవడానికి హువావేతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. 4జీ వరకు అన్ని రకాల పేటెంట్లు అమెరికా సంస్థలు పొంది ఉన్నాయి. 

కానీ 5జీ సేవలకు సంబంధించిన అన్ని రకాల పేటెంట్లు హువావే పొందింది. దీనికి సంబంధించిన టెక్నాలజీని సరఫరా చేయాలని అమెరికా కోరుతోంది. అందుకు హువావే యాజమాన్యం ససేమిరా అంటున్నది.

దాని ఫలితంగానే హువావే వల్ల తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటూ అమెరికా దానిపై నిషేధం విధించింది. అంతేకాదు ఆ సంస్థతో అమెరికా సంస్థలు సంబంధాలు కలిగి ఉండరాదని కూడా ఆదేశించడంతో గూగుల్, ఇతర టెక్ దిగ్గజాలు తెగదెంపులు చేసుకున్నాయి కూడా.