కాల్ చార్జీలు పెంచినా జియోనే బెస్ట్...ఎందుకంటే..!
వాయిస్ కాల్స్ చార్జీలు పెంచినా వినియోగదారులు రిలయన్స్ జియోనే విశ్వసించారు. చార్జీలు పెంచిన అక్టోబర్ నెలలోనే 91 లక్షల మంది టెలిఫోన్ వినియోగదారులు జియోలో కొత్తగా జత కలిశారు. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా అక్టోబర్ నెలలో సబ్ స్క్రైబర్లను పెంచుకున్నా.. నవంబర్ నెలలో వొడాఫోన్ కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గింది.
న్యూఢిల్లీ: టెలికం రంగంలో రిలయన్స్ జియో హవా కొనసాగుతున్నది. ఇటీవల తమ ఖాతాదారులకు షాకిస్తూ చార్జీల మోత మోగించినా వినియోగదారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కొత్త కనెక్షన్ల కోసం జియో వైపే మొగ్గుచూపారు.
అక్టోబర్‌లో జియోకు అదనంగా 91 లక్షల ఖాతాదారులు
అక్టోబర్ నెలలో ఏకంగా 91 లక్షల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు. దీంతో జియో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 36.43 కోట్లకు పెరిగినట్టు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు చార్జీలు వసూలు చేయనున్నట్టు ప్రకటించిన నెలలోనే ఖాతాదారులు పెరగడం గమనార్హం.
also read స్మార్ట్‌ఫోన్లకు ఫుల్ డిమాండ్...2019లో అమ్మకాలు అదుర్స్
ఇంటర్ కనెక్ట్ యూసేజీ చార్జీలు ఇలా పెంపు
జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేయనున్నట్టు జియో పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అక్టోబర్ 9వ తేదీన ప్రకటించింది. దీంతో జియో ఖాతాదారులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా అదేమీ కొత్త ఖాతాదారుల చేరికపై ప్రభావం చూపలేకపోయింది.
ఎయిర్ టెల్, వొడాఫోన్లకూ పెరిగిన సబ్ స్క్రైబర్లు
కాగా, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు కూడా అక్టోబరులో సబ్‌స్క్రైబర్లు పెరిగారు. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన వొడాఫోన్ ఐడియాకు అక్టోబర్ నెలలో 1.9 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. దీంతో ఆ సంస్థ మొత్తం సబ్‌స్క్రైబర్ల బేస్ 37.27 కోట్లకు పెరిగింది.
ఎయిర్ టెల్ కు కొత్తగా 81,974 మంది ఖాతాదారులు
భారతీ ఎయిర్‌టెల్‌కు 81,974 మంది కొత్త ఖాతాదారులు జత కలిశారు. ఫలితంగా ఎయిర్‌టెల్ మొత్తం ఖాతాదారుల సంఖ్య 32.56 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ నెలలో మొత్తం 117.37 కోట్లమంది వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు ఉండగా, అక్టోబర్ నెలలో ఇది ఏకంగా 118.34 కోట్లకు పెరగినట్టు ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి.
also read ఉద్యమాల వేదికగా ‘సోషల్ మీడియా’... కట్టడికి సర్కార్ వ్యూహాలు
నవంబర్ నెలలో వొడాఫోన్‌కు కస్టమర్ల షాక్
టెలికం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియాకు వినియోగదారులు షాకిచ్చారు. నవంబర్ నెలలోనే 3.63 కోట్ల మంది వినియోగదారులు తగ్గడంతో మొత్తం సంఖ్య 33.63 కోట్లకు తగ్గినట్లు తెలుస్తున్నది. అక్టోబర్ నెలలో 1.89 లక్షల మంది పెరిగినట్లు వెల్లడించిన సంస్థకు ఆ మరుసటి నెలలోనే భారీ స్థాయిలో తగ్గడం విశేషం. అక్టోబర్ చివరికల్లా 37,26,689 మంది వినియోగదారులు ఉన్నట్లు ట్రాయ్‌కు సమాచారం సంస్థ అందించింది.
నికరంగా మూడు కోట్ల మందిని కోల్పోయిన వొడాఫోన్ ఐడియా
తాజాగా నవంబర్ నెలలో ఈ సంఖ్య 33,63,57,324కి తగ్గినట్లు వెల్లడించింది. నికరంగా 3,63,19, 365 మంది వినియోగదారులను సంస్థ కోల్పోయింది. దీనిపై వొడాఫోన్ ఐడియా వర్గాలు స్పందించలేదు. క్రియాశీలక వినియోగ దారులను తగ్గించడం వల్లే కస్టమర్లు సంఖ్య భారీగా తగ్గినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. యాక్టివ్ సబ్‌స్ర్కైబర్ల కాలపరిమితిని కూడా 120 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించింది సంస్థ.