జియో మరో సంచలనం: వాటాల విక్రయంతో వేల కోట్ల నిధులు...
వచ్చే ఏడాది మార్చి నాటికి రుణ రహిత సంస్థగా రిలయన్స్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. మూడు వారాల్లోనే రిలయన్స్ జియో తన వాటాల విక్రయం ద్వారా రూ.60 వేల కోట్ల పెట్టుబడులు సంపాదించడమే దీనికి నిదర్శనం
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని రిలయన్స్ జియో తన సంస్థలో వాటాల విక్రయం విషయమై దూకుడుగా ముందుకు సాగుతోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో చురుగ్గా వ్యవహరిస్తోంది.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న విస్టా ఈక్విటీ పార్టనర్స్ కంపెనీకి తన డిజిటల్ ప్లాట్స్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాను రిలయన్స్ జియో విక్రయించింది. దీంతో రిలయన్స్ జియోకు రూ.11,367 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి.
కేవలం రెండు వారాల్లోపే రిలయన్స్ జియో మూడు విదేశీ సంస్థలకు వాటాలను విక్రయించడం గమనార్హం. దీనివల్ల రిలయన్స్ జియోకు రూ.60,597.37 కోట్ల నిదులు రానున్నాయి.
తద్వారా రిలయన్స్ రుణ రహిత సంస్థగా రూపుదిద్దుకునేందుకు మార్గం సుగమం అవుతోంది. గత మార్చి నెలాఖరు నాటికి రూ.1.61 లక్షల కోట్ల అప్పుతో ఉన్నరిలయన్స్ 2021 నాటికి రుణ రహిత సంస్థగా అవతరించే లక్ష్య సాధనలో సమీప దూరంలో నిలిచింది.
also read రియల్ మీ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు...మే 11న లాంచ్...
ఇంతకుముందు రిలయన్స్ జియో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, సిల్వర్ లేక్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని జియో జోరు సాగిస్తున్నది. తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్ కంపెనీతో మరో మెగా ఒప్పందానికి జియో సన్నద్ధమైంది.
ఈ ఒప్పందం ద్వారా ఆర్ఐఎల్‌కు రూ.11,367 కోట్లు సమకూరనున్నాయి. ఈ ఒప్పందం విలువ ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్‌లు శుక్రవారం ప్రకటించాయి. దీంతో శుక్రవారం నాటి మార్కెట్ లో రిలయన్స్ 3 శాతానికి పైగా ఎగిసింది.
దీంతో విస్టా జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచింది. గత పదేళ్ల నుంచి టెక్నాలజీ కంపెనీల్లో విస్టా పెట్టుబడులు పెడుతున్నది.విస్టా ఈక్విటీ మీడియా, ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్, రియాల్టీ రంగాల్లో 57 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.