రిలయన్స్ జియో మరో భారీ డీల్... ఫేస్ బుక్ కంటే ఎక్కువ...
అదనపు నిధుల సేకరణలో రిలయన్స్ అనుబంధ జియో వేగం పెరిగింది. గత వారం ఫేస్ బుక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జియో.. తాజాగా అమెరికాకు చెందిన పీఈ జెయింట్ సంస్థ సిల్వర్ లేక్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. ఫేస్ బుక్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కంటే ఇది రూ.5656 కోట్లు ఎక్కువ.
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా రుణ రహిత సంస్థగా రూపాంతరం చెందాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) వ్యూహంలో మరో ముందడుగు పడింది. రిలయన్స్ అనుబంధ జియో మరో భారీ డీల్ సాదించింది.
రిలయన్స్ జియోలో అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ సంస్థ రూ. 5,655 కోట్ల (750 మిలియన్ డాలర్ల) విలువైన 1.15 శాతం జియో వాటాలను కొనుగోలు చేసింది.
ఇంతకుముందు రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్‌బుక్ 5.7 బిలియన్ డాలర్ల మెగా డీల్ చేసుకున్న వారం రోజుల తరువాత జియో మరో మెగా డీల్ సాధించడం విశేషం. దీనిపై ఇరు సంస్థలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఒప్పందం మార్కెట్ రెగ్యులేటరీ, ఇతర సంబంధిత చట్ట అనుమతులను పొందాల్సి ఉంది.
also read అలెర్ట్ : వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా...అయితే మీ కంప్యూటర్లపై సైబర్ దాడులు జరగొచ్చు..
ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా రికార్డు ఉన్న సిల్వర్ లేక్ భాగస్వామ్యం సంతోషాన్ని ఇస్తోందన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామమని పేర్కొన్నారు.
మరో వైపు అత్యంత ముఖ్యమైన సంస్థలలో ఒకటిగా రిలయన్స్ జియోను సిల్వర్ లేక్ కో సీఈఓ ఎగాన్ డర్బన్ అభివర్ణించారు. చాలా బలమైన, వ్యవస్థాపక నిర్వహణ బృందం నేతృత్వంలో నడుస్తున్న సంస్థ రిలయన్స్ జియోతో భాగస్వామ్య ఒప్పందం కుదరడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఫేస్‌బుక్ పెట్టుబడితో పాటు, ఆర్ఐఎల్ ఇతర వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారుల భారీ ఆసక్తి నెలకొందని, రాబోయే నెలల్లో ఇదే తరహా పెట్టుబడిని సాధించనున్నామని ఏప్రిల్ 30న త్రైమాసిక, వార్షిక ఫలితాలను రిలయన్స్ ప్రకటించింది.