వృద్ధులు, దివ్యాంగులకూ గుడ్ న్యూస్: బ్యాంక్ నుంచి క్యాష్ 'హోం డెలివరీ'
ప్రజల వద్దకే పాలన మాదిరిగా ఇంటి వద్దకే డబ్బులు అందజేయనున్నట్లు ప్రకటించింది పేటీఎం పేమెంట్ బ్యాంకు (పీపీబీఎల్). బ్యాంకింగ్ వ్యవస్థను సులభతరం చేసేందుకు 'క్యాష్ ఎట్ హోమ్'ను ప్రారంభించింది. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంత వృద్ధులకు, వికలాంగులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులో తేనున్నది. కేరళ ఈ ఫెసిలిటీ అమలు చేస్తుండగా, హర్యానా ఇందుకోసం కొత్తగా పోర్టల్ తెరిచింది.
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ నగదు బదిలీ సంస్థ పేటీఎం కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు లిమిటెడ్ (పీపీబీఎల్) ఖాతాదారులకు కరోనా విపత్తు సమయంలో.. కాలు బయట పెట్టకుండా 'క్యాష్ ఎట్ హోమ్' (ఇంటి వద్దకే డబ్బు)ని అందిస్తామని ప్రకటించింది.
ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతంలో వృద్ధులకు, వికలాంగులకు క్యాష్ ఎట్ హోం సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేటీఎం తెలిపింది. రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో ఖాతాదారులకు క్యాష్ డోర్ డెలివరీ చేస్తుంది. ఖాతాదారుడు తన కేవైసీ పత్రాల్లో తెలిపిన చిరునామాకు వెళ్లి సదరు వ్యక్తికి సంబంధిత పేటీఎం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ నగదు అందజేస్తారు.
పేటీఎం పేమెంట్ బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉన్నవారు తమ మొబైళ్లలో పేటీఎం యాప్ తెరిచి.. తమ ఖాతా నుంచి ఎంత డబ్బు కావాలని అనుకుంటున్నారో అభ్యర్థిస్తే సరిపోతుంది. ఈ మేరకు ఖాతాలో ఉన్న చిరునామాకు డబ్బులు డెలివరీ చేస్తామని పేటీఎం సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
కనిష్ఠంగా రూ.1000.. గరిష్ఠంగా రూ.5000 పరిమితి వరకు ఈ సేవల ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చని పేటీఎం తెలిపింది. ‘బ్యాంకింగ్ రంగాన్ని మరింత సౌకర్యవంతంగా వినియోగదారులకు అందుబాటులో ఉంచడానికి.. బ్యాంకు ప్రారంభించిన సేవల్లో 'క్యాష్ ఎట్ హోమ్' సౌకర్యం కొత్తది’ అని పేటీఎం పేర్కొన్నది.
also read ఎయిర్‌టెల్ డబుల్ డేటా ఆఫర్..కేవలం రూ.98కే..
‘ఇటీవల ప్రత్యక్ష బదిలీ ప్రయోజన (డీబీటీ) సదుపాయాన్ని ప్రారంభించాం. దీని ద్వారా వినియోగదారులు 400కు పైగా ప్రభుత్వ రాయితీల ప్రయోజనాలు నేరుగా వారి పీపీబీఎల్ పొదుపు ఖాతాలోకి వెళ్లిపోతాయి’ అని పేటీఎం పేమెంట్ బ్యాంకు లిమిటెడ్ వెల్లడించింది.
‘మా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు సులభతరం చేస్తూ.. దేశంలో డిజిటల్ బ్యాంక్ పరిధిని విస్తరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. వయస్సు, అనారోగ్యం, ఇతర సమస్యల వల్ల ఎటీఎం, బ్యాంకులకు వెళ్లలేని వారికి నూతన 'క్యాష్ ఎట్ హోమ్' సౌకర్యం ఎంతో సహాయపడుతుంది" అని పీపీబీఎల్ సీఈఓ సతీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌లు తమ ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింగ్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత కరోనా కాలంలో హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్.. రాష్ట్ర పౌరులు తమ ఇంటి వద్ద క్యాష్ డెలివరీ చేయడానికి నూతన పోర్టల్‌తో ముందుకు వచ్చింది. ఇందుకోసం ఈ పోర్టల్ సంబంధిత ఖాతాదారులకు టైం స్లాట్ కేటాయిస్తుంది.
కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న భౌతిక (సామాజిక) దూరం పాటించడానికి కేరళ కూడా ప్రజలకు.. ప్రత్యేకించి వ్రుద్ధులు, వికలాంగులకు ఇళ్ల వద్దకే క్యాష్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. దేశ రాజధాని ప్రాంత పరిధిలో నోయిడాలోనూ ఎట్ డోర్ స్టెప్ క్యాష్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకు వచ్చింది.