భారతీయ మొబైల్ ఫోన్ల వినియోగదారులకు డేటా చార్జీల మోత మోగనున్నది. కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత చౌక మొబైల్ డేటా చార్జీలను భారతీయులు ఆస్వాదిస్తున్నారు. ఇక ఆ దశ ముగియనున్నది. త్వరలోనే మొబైల్ రీచార్జీ, పోస్ట్ పెయిడ్ చార్జీల బిల్లు మోత మోగనున్నది.

టెలికం సర్వీసు ప్రొవైడర్లు కోరినట్లు టెలికం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ కనీసంగా డేటా చార్జీ రేట్లను నిర్ణయిస్తే ప్రస్తుతం ఉన్న డేటా చార్జీలు అంటే మొబైల్ ఇంటర్నెట్ ధరలు ఐదు నుంచి 10 రెట్లు పెరుగనున్నాయి.

టెలికం సంస్థలకు అనుగుణంగా ట్రాయ్ స్పందిస్తే..
టెలికం సర్వీసు ప్రొవైడర్ల ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందిస్తే మొబైల్ ఇంటర్నెట్ రెట్లు 5-10 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక జీబీ డేటా చార్జీ కనీసం రూ.35గా ఉండాలని వొడాఫోన్ ఐడియా కోరింది. భారతీ ఎయిర్ టెల్ రూ.30 ఉండాలని, రూ.20 ఉండాలని రిలయన్స్ జియో ఇప్పటికే ట్రాయ్, టెలికం శాఖ ముందు ప్రతిపాదనలు సమర్పించాయి. 

also read ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్, ఎంఐ 108 ఎంపీ కెమెరాతో షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లు...

రూ.3-5లకే ఒక జీబీ డేటా లభ్యం
భారతీయ మొబైల్ వినియోగదారులు ఒక జీబీకి రూ.3-5 చొప్పున 4జీ డేటా అందుకుంటున్నారు. మరోవైపు డేటా చార్జీల పెంపు విషయమై ట్రాయ్ సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నది. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల ప్రతిపాదనలకు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు.

ఏజీఆర్ చెల్లింపులు, రుణ బకాయిలతో కష్టాల్లో టెలికం సంస్థలు
ఇటీవలి ఏజీఆర్ చెల్లింపుల అంశం, బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థలకు టెలికం సంస్థల భారీ రుణ బకాయిలు, నిలకడగా చార్జీలు, డేటా చార్జీలు తగ్గడం వల్ల మరో మార్గాంతరం లేదని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. అయితే టెలికం రంగ సమస్య పరిస్కారానికి ఇది దీర్ఘ కాలిక పరిష్కారం కూడా కాదన్నారు.

చార్జీల పెంపు హానికర పోటీకి మార్గం: సీసీఐ ఆందోళన
టెలికం రంగంలో కనీస చార్జీలను పెంచడం వాంఛనీయం కాదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పేర్కొంది. ప్రస్తుతం టెలికం రంగంలో తిరోగమన దశ నెలకొన్నదని, ఇది మార్కెట్ పోటీపై హానికర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.


ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు మరోసారి ఆల్టిమేటం
ఏజీఆర్‌ బకాయిల  చెల్లింపు విషయంలో మరోసారి కేంద్రం  టెల్కోలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఇప్పటివరకు టెలికాం ఆపరేటర్ల నుండి సుమారు రూ .25,900 కోట్ల ఏజీఆర్‌ బకాయిలను ప్రభుత్వం అందుకుందనీ, త్వరలోనే పూర్తి చెల్లింపులు చేయమని టెల్కోలను మళ్లీ ఆదేశించామని పార్లమెంటుకు అందించిన సమాచారంలో కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే  వెల్లడించారు. 

సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం మార్చి నాలుగో తేదీన లేఖ
అక్టోబర్ 24, 2019 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని చెల్లింపులు చేశాయని బుధవారం  లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో సంజయ్ ధోత్రే తెలిపారు. ఈ నెల నాలుగో తేదీన టెలికం సంస్థలకు రాసిన లేఖలో పూర్తి చెల్లింపులు చేయాలని ఆపరేటర్లను ఆదేశించామన్నారు. అలాగే టెలికాం రంగంలో గుత్తాధిపత్యం లేదా కార్టలైజేషన్‌ నివారించడానికి కొత్త  యాంట్రీ ట్రస్ట్‌ లాను ఏర్పాటు చేసే  ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని మరో ప్రశ్నకుసమాధానంగా వెల్లడించారు. 

also read కరోనా వైరస్ రాకుండా...'కోవా పంజాబ్' మొబైల్ యాప్...

ఏజీఆర్ చెల్లింపుల తీరిలా..
భారతి ఎయిర్‌టెల్ ఇప్పటివరకు రూ .18,004 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .3500 కోట్లు చెల్లించినట్లు కేంద్రమంత్రి సంజయ్ ధోత్రే తెలిపారు. టాటా టెలిసర్వీసెస్ సుమారు రూ.4,197 కోట్లు చెల్లించగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.3.9 కోట్లు , రిలయన్స్ జియో సుమారు రూ .195 కోట్లు చెల్లించిందన్నారు. 

రెండేళ్లపాటు స్పెక్ట్రం బకాయిల చెల్లింపుపై మారటోరియం
టెలికాం రంగంలో ఆర్థిక ఇబ్బందులపై జోక్యం చేసుకోవాలన్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఏఐ)  అభ్యర్థన మేరకు టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించామన్నారు. 

2020-21 నుంచి రెండేళ్ల చెల్లింపులకే మారటోరియం
2020–21, 2021–22లలో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుందన్నారు. ఏజీఆర్‌ వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే.