న్యూఢిల్లీ: కరోనా ‘లాక్​డౌన్’తో దుకాణాలన్నీ మూసి ఉండటంతో హెయిర్​ కట్​ చేసుకోవడం ఎలాగో ఎవరికీ తెలియదు. ఏమైనా ప్రయోగాలు చేద్దామంటే తగిన సరంజామా లేదు. లాక్​డౌన్​ ముగిసినా, ఆంక్షలు సడలించినా,  గతంలో మాదిరిగా ధైర్యంగా సెలూన్​కు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు 'ట్రిమ్మర్'​పై పడింది. 

ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత త్వరగా ఒక ట్రిమ్మర్ కొనుగోలు చేయాలని చూస్తున్నారు. సరసమైన ధరకు మంచి ట్రిమ్మర్​లు ఏమున్నాయోనని ఈ-కామర్స్​ సైట్లలో తెగ వెతికేస్తున్నారని వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్ ఈ సంగతి బయటపెట్టింది.

గత 15 రోజులుగా వినియోగదారులు అత్యధికంగా శోధించిన టాప్​-10 వస్తువుల జాబితాలో ట్రిమ్మర్లు ఉన్నట్లు ఫ్లిప్​కార్ట్ తెలిపింది​. గత నెల​ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వీటి కోసం వెతికిన వారి సంఖ్య 4.5 రెట్లు పెరిగిందని వెల్లడించింది.

అలాగే గ్యాస్​ స్టౌవ్​ల కోసం వెతుకుతున్న వారి సంఖ్య రెండింతలు అయినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే.. ఫ్యాన్లు, ఏసీల పరిస్థితి ఏటా వేసవిలో ఎలా ఉంటుందో అదే రీతిలో ఉన్నట్లు స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఆరెంజ్​, గ్రీన్​ జోన్లలో అత్యవసర, ఇతర ఉత్పత్తుల అమ్మకాలకు ఈ-కామర్స్​ సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. 

‘ల్యాప్​టాప్స్​, మొబైల్స్​, ఏసీ, కూలర్స్​, టీ-షర్ట్స్​ వంటి వాటి కోసం ఎక్కువగా వెతకటాన్ని గుర్తించాం. దేశవ్యాప్తంగా లక్షల మంది అమ్మకందారులు, ఎంఎస్​ఎఈలతో కలిసి మా సంస్థ పనిచేస్తోంది’ అని ఫ్లిప్​కార్ట్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్ అనిల్​ గోటేటి​ తెలిపారు.

also read  వాట్సాప్-పే కొత్త ఫీచర్...త్వరలో అందుబాటులోకి...

‘ప్రస్తుత సమయంలో వినియోగదారులకు ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు మా సంస్థ ప్రయత్నిస్తోంది. సురక్షితమైన, శానిటైజ్ చేసిన​ సరఫరా చైన్​తో వినియోగదారుల ఇంటికి ఉత్పత్తులను చేరవేసేందుకు నిరంతరం సేవలందిస్తుంది ఫ్లిప్​కార్ట్​. ప్రభుత్వ, స్థానిక అధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా సేవలు కొనసాగుతాయి’ అని ఫ్లిప్​కార్ట్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్ అనిల్​ గోటేటి​ చెప్పారు. 

కరోనా భయాలతో ప్రజలు బయటకు పెద్దగా వచ్చే పరిస్థితులు లేనందున.. ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉన్నదని ఈ-కామర్స్ పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం చిన్న దుకాణాలను అనుమతించి.. మాల్స్​, పెద్ద మార్కెట్లకు మూసి ఉంచితే, హోండెలివరీ కోసం ప్రజలు ఆన్​లైన్​ స్టోర్స్​పైనే ఆధారపడతారని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ… గిడ్డంగులు, లాజిస్టిక్స్​లో సిబ్బంది కొరత కారణంగా డెలివరీలో జాప్యం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

తమ వినియోగ‌దారుల‌కు సుర‌క్షిత‌మైన ప‌ద్ద‌తిలో ప‌రిశుభ్ర‌మైన చైన్ ద్వారా సేవ‌లు కొన‌సాగిస్తున్నామ‌ని ఫ్లిప్​కార్ట్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్ అనిల్​ గోటేటి​ వెల్ల‌డించారు. స్థానిక రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల‌కు అనుగూణంగా న‌డుచుకుంటున్నామ‌ని తెలిపారు. మొద‌టి, రెండ‌వ లాక్‌డౌన్ ముగిసి మూడో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ కామ‌ర్స్ సంస్థ‌ల ద్వారా కిరాణా, ఇత‌ర అత్య‌వ‌స‌ర సామాన్లు మాత్ర‌మే అందిస్తున్నారు.