ముంబై: ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడుల మేనియా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ కంపెనీలు జియోలో పెట్టుబడులకు బారులు తీరాయి. 

తాజాగా ఈ వరుసలో మరో టాప్ కంపెనీ నిలవనుంది. వరుస మెగా ఒప్పందాలతో దూకుడుగా ఉన్న జియో శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టాప్ ఇన్వెస్టర్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌తో మరో భారీ ఒప్పందానికి సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు చురుగ్గా సాగుతున్నట్టు సమాచారం. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియోలో టీపీజీ క్యాపిటల్ సంస్థ ఒకటి నుంచి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మరి కొద్ది రోజుల్లో రానుందని తెలిపింది.

also read  ట్విట్టర్ సరికొత్త ఫీచర్..రీట్వీట్ చేసే ముందు ప్రాంప్ట్ మెసేజ్...

1992లో ఏర్పాటైన  టీపీజీ ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా  45కి  పైగా స్టార్టప్‌ సంస్థలలో 70 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ప్రధానంగా ఎయిర్‌ బీఎన్‌బీ, నైకా, లివ్‌స్పేస్ లెన్స్‌కార్ట్, బుక్‌ మైషో, సర్వేమన్‌కీ తదితర సంస్థలు ఉన్నాయి.  

కాగా గత ఏడు వారాల్లో జియోలో 21 శాతం వాటాల విక్రయం ద్వారా ఇప్పటికే రూ. 97,885.65  కోట్ల పెట్టుబడులను సాధించింది. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, రెండుసార్లు విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్,  కేకేఆర్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ)  కంపెనీలతో మెగా డీల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

దీంతో వచ్చే డిసెంబర్ నాటికి రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దాలన్న ముకేశ్ అంబానీ సంకల్పం నెరవేరే రోజు త్వరలోనే ఉన్నట్లు కనిపిస్తున్నది. ఫేస్‌బుక్ సంస్థతో భాగస్వామ్యం ద్వారా దేశీయంగా ఈ-కామర్స్ ‘జియోమార్ట్’ సేవలను ప్రయోగాత్మకంగా రిలయన్స్ ప్రారంభించింది.