అరుదైన ఘనత సాధించిన ఇస్రో.. విజయవంతంగా పూర్తయిన డాకింగ్ ప్రక్రియ
ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విజయంతో అంతరిక్ష డాకింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. జనవరి 7, 9 తేదీల్లో సాంకేతిక సమస్యల కారణంగా రెండు డాకింగ్ ప్రయత్నాలు విఫలంకాగా ఇప్పుడు విజయవంతమైంది. ఇస్రో ఈ ఉపగ్రహాలను డిసెంబర్ 30వ తేదీన ప్రయోగించిన విషయం తెలిసిందే..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ విజయవంతగా పూర్తైట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఇస్రో ఈ ప్రయోగాన్ని 2024 డిసెంబర్ 30న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన విషయం తెలిసిందే. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) మిషన్‌లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ ఉపగ్రహాలను PSLV-C60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
అనంతరం రెండు ఉపగ్రహాలను 3 మీటర్ల దూరంలోకి తీసుకువచ్చిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం స్పేస్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. జనవరి 7, 9 తేదీల్లో సాంకేతిక సమస్యల కారణంగా రెండు డాకింగ్ ప్రయత్నం విఫలం కాగా ప్రస్తుతం విజయవంతమైంది.
మోదీ అభినందనలు..
ఇస్రో సాధించిన ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంపై స్పందిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో భారతదేశం నిర్వహించనున్న మరిన్ని అంతరిక్ష యాత్రలకు ఇది ఒక ముఖ్యమైన ఘట్టమని మోదీ అభిప్రాయపడ్డారు.