న్యూఢిల్లీ: కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు.. వంటి అంశాలతో ఇటీవలి కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో అంతర్జాల సేవలను నిలిపివేశారు అధికారులు. ఈ చర్యలతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గినా.. టెలికాం ఆపరేటర్లు మాత్రం తమ వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. 

ఇంటర్నెట్​ నిషేధం విధించే ప్రాంతాల్లో.. టెలికాం ప్రొవైడర్లు గంటకు రూ. 2.45 కోట్లు నష్టపోయారని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 105 సార్లు, 2018లో 134 సార్లు అంతర్జాలాన్ని నిలిపేశారని గణాంకాలు పేర్కొంటున్నాయి. సాఫ్ట్​వేర్ ఫ్రీడమ్​ లా సెంటర్ (ఎస్​ఎఫ్​ఎల్​సీ) అనే సంస్థ నడుపుతున్న 'ఇంటర్నెట్ షట్​డౌన్స్.ఇన్' అనే ఓ వెబ్​సైట్ ఈ గణాంకాలను లెక్కిస్తోంది. దేశానికి అవసరమైన సందర్భాల్లో ఇంటర్నెట్​ సేవల రద్దు ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.

also read ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ పెంపు... ఆదివారం నుంచే అమలు..

వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సబిమల్ భట్టాచార్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అంతర్జాల నిషేధం ప్రభావం జనజీవనంపై పడినప్పటికీ ఇది శాంతి, భద్రతలను అదుపులో ఉంచేందుకు అవసరం. ఇంటర్నెట్​లో వ్యాప్తి చెందే విద్వేషపూరిత సందేశాలతో సమస్యలు ఉత్పన్నమైతే అంతర్జాలం నిలిపివేత తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు’ అని తెలిపారు. 

2012-17 మధ్య 16వేల గంటల పాటు అంతర్జాలాన్ని నిలిపేశారని భారత్​, అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలను పరిశీలించే ఐసీఆర్​ఐఈఆర్ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ వాడకంపై నిషేధం విధించడం వల్ల భారత్ రూ. 21 వేల కోట్లు నష్టపోయిందని స్పష్టం చేసింది.

‘వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. పేటీఎం సహా అన్ని రకాల వ్యాపారాలు కుంటుపడ్డాయి. అయితే జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం సరైనదే’ అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తక్కువలో తక్కువ ఐదు గంటల సమయం ఇంటర్నెట్ లేకపోతే తీవ్ర నష్టం కలుగుతుందని ఓ హోటల్​ నిర్వహకుడు అన్నారు. 

also read వావ్ ఒప్పో.. 14.60 లక్షలు దాటిన రెనో సిరీస్ ఫోన్ల బుకింగ్స్

ఇంటర్నెట్ జన జీవనాన్ని మెరుగు పరుస్తుందని, అయితే ఇంటర్నెట్ సేవల రద్దు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని ఆ హోటల్ నిర్వాహకుడు తెలిపారు.ఆర్టికల్ 370 రద్దు నుంచి తరచూ అంతర్జాల సేవలు రద్దు అవుతున్నాయని వ్యాఖ్యానించారు ఎస్​ఎఫ్​ఎల్​సీ సభ్యుడు శశాంక్ మోహన్. సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఇంటర్నెట్ రద్దు ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు.

ఎస్​ఎఫ్ఎల్​సీ సభ్యుడు శశాంక్ మోహన్ స్పందిస్తూ.. ‘2012 నుంచి అంతర్జాల రద్దుపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. 2019లో చాలాసార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రస్తుత పౌరచట్ట వ్యతిరేక ఆందోళనలతో ప్రభుత్వం తరచుగా ఇంటర్నెట్‌ను నిలిపేస్తుంది. అయితే గతేడాది అన్ని సంవత్సరాల కన్నా ఎక్కువగా ఇంటర్నెట్ నిలిపేశారు’ అని ఆందోళన వ్యకం చేశారు.