ఐటీ రంగానికి కరోనా కష్టాలు...తేల్చేసిన ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో

కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫ్లాట్ లేదా నెగిటివ్ గ్రోత్‌కే పరిమితం కావాల్సి వస్తుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ బాలకృష్ణన్ పేర్కొన్నారు. భారత ఐటీ రంగం ఆధార పడిన అమెరికాలో కరోనా మరణ మ్రుదంగం మోగిస్తోందని, దీని ప్రభావం దేశీయ ఐటీ ఎగుమతులపై తప్పనిసరిగా ఉంటుందన్నారు. 

Flat or negative growth for Indian IT sector this year: Ex-Infosys CFO Balakrishnan

బెంగళూరు: కరోనా వైరస్ ప్రభావం దేశీయ ఐటీ రంగంపై పెద్దగానే పడుతున్నది. వృద్ధికి దూరంగానే ఈ ఏడాది పరిశ్రమ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాణాంతక మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతున్నది. 

దేశంలోనూ లాక్‌డౌన్ అమలవుతుండగా, జనజీవనం స్తంభించి వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. ఇందుకు ఐటీ రంగం మినహాయింపు కాదు.

నిజానికి ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నా, విదేశీ ఎగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడ్డ భారతీయ ఐటీ రంగానికి కరోనా కష్టాలు తప్పడం లేదు. కరోనా వైరస్ ప్రభావం దేశీయ ఐటీ రంగంపై పెద్దగానే పడుతున్నది. వృద్ధికి దూరంగానే ఈ ఏడాది పరిశ్రమ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ఈ ఏడాది ఐటీ రంగ వృద్ధి స్థిరంగానో లేదంటే  ప్రతికూలంగానో ఉండవచ్చని  ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్ శనివారం పీటీఐకి తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధిరేటు నమోదైతే నిజంగా ఆశ్చర్యమేనని వ్యాఖ్యానించారు. 

2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యం కంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయని బాలకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌నే మార్గంగా ఎంచుకున్నాయి. దీంతో అంతటా ఆర్థిక మందగమనమే.

ఇప్పటికే ప్రపంచాన్ని మాంద్యం మబ్బులు కమ్మేశాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరించింది కూడా. ఈ క్రమంలో ఇప్పుడు బాలకృష్ణన్ సైతం ‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులను ఒక్కసారి చూడండి. 2008 కంటే దారుణంగా కనిపిస్తున్నాయి’ అని అన్నారు.

2008 నాటి మాంద్యం తర్వాత కూడా దేశీయ ఐటీ కంపెనీలు కొంత వృద్ధిరేటును కనబరిచాయని, త్వరగా కోలుకున్నాయని కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించట్లేదని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ బాలకృష్ణన్ అన్నారు. దీనికి కారణం కరోనా వైరస్‌కు ఔషధం ఇంకా లేకపోవడమేనని, ఈ మహమ్మారి ఎప్పుడు? ఎలా? అంతమైపోతుందో తెలియకపోవడమేన్నారు. 

సింగపూర్ లాంటి దేశాల్లోనూ లాక్‌డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని బాలకృష్ణన్ గుర్తుచేశారు. ఈ క్రమంలో భారతీయ ఐటీ సంస్థల ైక్లెయింట్లు పెట్టుబడులను భారీగా తగ్గించుకునే వీలున్నదని, ఇప్పటికే సిద్ధమైన పెట్టుబడులనూ వెనక్కి తీసుకోవచ్చన్నారు. ఈ పరిణామం దేశీయ ఐటీ రంగ ఆదాయానికి గండి కొట్టనున్నది.

అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న సంస్థలు తమ ఉద్యోగులకు అభయమిచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ మధ్య ఉద్యోగాలకు వచ్చిన భయమేమీ లేదన్నాయి. పలు సంస్థలు ఈ విపత్కర పరిస్థితులు మూడు నెలలున్నా.. భయపడవద్దని చెప్పాయి. 

మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏకంగా ఏడాదిపాటు ఉద్యోగ కోతల జోలికి వెళ్లబోమని హామీ ఇవ్వడం గమనార్హం. ఎస్‌ఏపీ, సేల్స్‌ఫోర్స్, బూజ్ అల్లెన్ హామిల్టన్ సంస్థలు 90 రోజులు ఇదే పరిస్థితులున్నా ఉద్యోగులకు వచ్చిన ముప్పేమీ లేదన్నాయి.

అయితే వెల్స్ ఫర్గో, జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్, హెచ్‌ఎస్‌బీసీ, డ్యూషే బ్యాంక్, క్రెడిట్ సూసీ, స్టార్‌బక్స్, పేపాల్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ మాత్రం ఇప్పటికెలా ఉన్నా.. భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం లేదు. ఉద్యోగాల హామీ ఇవ్వలేకున్నా.. ఉద్యోగుల్ని కాపాడుకుంటామని చెప్తున్నాయి. 

సెర్చింజన్ గూగుల్, ఈ రిటైలర్లు అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు కరోనా ప్రభావిత ఉద్యోగాల తొలగింపు ఉండవని స్పష్టం చేశాయి. తమ నగదు నిల్వల్ని ఈ కష్టకాలంలో జీతాలకు వాడుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ పెను బీభత్సాన్నే సృష్టిస్తున్నది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యంలో మరణ మృదంగం మోగుతున్నది. 

కరోనా మృతులు లక్షకు పరిమితమైతే మనం అదృష్టవంతులమేనన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలనుబట్టి అక్కడ కరోనా విలయాన్ని అంచనా వేసుకోవచ్చు. అయితే భారత ఐటీ రంగానికి అతిపెద్ద విదేశీ కస్టమర్ అమెరికానే. అలాంటి దేశం ఇప్పుడు కరోనా కాటుకు బలైపోతున్నది. 

ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగంపైనా తప్పక ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిటైల్, ఆర్థిక సేవలు తదితర కీలక రంగాలన్నింటిపైనా కరోనా ప్రభావం గట్టిగా కనిపిస్తున్నదని, నిరుద్యోగం పెరిగిపోయే ప్రమాదం ఉందని బాలకృష్ణన్ అన్నారు. ప్రాజెక్టులు తగ్గి వాటి ధరలు కూడా పడిపోయే వీలుందని చెప్పారు. 

ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగాలేవని కొత్త పెట్టుబడులకు ఆస్కారం ఉండకపోవచ్చునని బాలకృష్ణన్ తెలిపారు. ఈ ఏడాది ఐటీ రంగానికి గడ్డు కాలమేననిపిస్తున్నది అని అన్నారు. ఐరోపా దేశాల్లోనూ కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తుండటం భారతీయ ఐటీ పరిశ్రమకు శరాఘాతమవుతున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios