సైబర్ హ్యాకర్ల కొత్త ట్రెండ్.. మెయిల్స్ హ్యాకింగ్‌తో రూ.లక్షలు స్వాహా!
సైబర్ నేరగాళ్లు.. హ్యాకర్లు తెలివి మీరారు. తాము చేసే నేరాలను పోలీసులు కనిపెడుతుండటంతో రూట్, తాము ఉండే ప్లేస్ మార్చారు. ముంబై కేంద్రంగా బడా సంస్థలు, కాంట్రాక్టర్ల ఖాతాలు, ఈ-మెయిల్స్ హ్యాక్ చేసి.. అటుపై మొబైల్ ఫోన్ స్తంభింపజేసి రూ. లక్షలు కాజేస్తున్నారని హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్: హ్యాకర్లు రూట్ మార్చారు. సైబర్ నేరాలకు పాల్పడే నైజీరియన్లు కరోనాను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్ విధించిన వేళ పంథా మార్చారు. ముంబైకి మకాం మార్చారు. ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేసి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఏఏ సంస్థలు, కంపెనీలతో రూ.లక్షల్లో నగదు లావాదేవీలు చేస్తున్నారో గుర్తించి నకిలీ మెయిల్స్ పంపి, నగదు వారి ఖాతాల్లోకి వేయించుకుంటున్నారు.
వారం రోజుల్లో ఇద్దరి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాల్లోంచి రూ.88 లక్షలు బదిలీ చేసుకున్నారు. వీటిని కోల్‌కతా, ముంబై, ఢిల్లీలోని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లోనూ ఐపీ చిరునామాలు ముంబైవని ఓ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
సంబంధిత సంస్థల ఖాతాలు ఓపెన్ చేసినప్పుడు వాటి యజమానులకు ఓటీపీలు రాకుండా చేసి, తమ పని పూర్తి కానిచ్చేస్తున్నారు. ఇలా బంజారాహిల్స్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ రూ.50 లక్షలు నష్టపోయారు. ఆ కాంట్రాక్టర్ యాహూ మెయిల్ హ్యాక్ చేసి, మొబైల్ ఫోన్ నంబర్ తెలుసుకున్నారు.
also read చైనా తరహాలోనే భారత్... స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ..
సంబంధిత నెట్‌వర్క్ కార్యాలయానికి ఫోన్ చేసి మొబైల్ నంబర్ ఫోన్ చేయకుండా స్తంభింపజేశారు. అటుపై రెండు దఫాలుగా డబ్బు కొల్లగొట్టిన తర్వాత సంబంధిత నెట్‌వర్క్‌కు ఫోన్ చేసి మొబైల్ పనిచేయించాలని కోరారు.
ఓవర్ డ్రాఫ్ట్ బ్యాంక్ ఖాతాలపై సైబర్ నేరస్థులు ప్రధానంగా గురి పెట్టారు. మెయిల్‌లోని బ్యాంకు ఖాతా పాస్‌వర్డ్ ద్వారా డబ్బు తస్కరించారు. సికింద్రాబాద్‌లోని ఇనుము వ్యాపారి దీనివల్ల రూ.38 లక్షల మేరకు నష్టపోయారు. ఎలాగంటే, ఆయన ఈ-మెయిల్ హ్యాక్ చేశారు. అటుపై అందులో నమోదు చేసుకున్న బ్యాంకు ఖాతా పాస్‌వర్డ్ తెలుసుకుని, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలను పరిశీలించారు.
బంజారాహిల్స్ కాంట్రాక్టర్ డబ్బు తస్కరించినట్లే.. ఈ ఇనుము వ్యాపారి మొబైల్ ఫోన్ పని చేయకుండా నిలిపివేయించి, దానికి ఓటీపీలు రాకుండా చేశారు. తర్వాత రూ.38 లక్షలు డ్రా చేసుకున్నారు. ఇలాగే కోల్‌కతాలో సంతోష్‌శర్మ, జితేందర్, సందీప్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి రూ.38 లక్షలు బదిలీ చేసుకున్నారని సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలింది.