న్యూఢిల్లీ: కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కొత్తగా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకు డిమాండ్‌ పెరిగింది. వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచి పని), ఆన్‌లైన్‌ తరగతుల బోధన కారణంగా కనెక్షన్ల డిమాండ్‌ 40 శాతం పెరిగింది.

తరగతుల సంఖ్య పెరగడం, ఇంట్లో చదువుకునే పిల్లలు ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఉన్నవారు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించడానికన్నా ముందుతో పోల్చితే ప్రస్తుతం రోజువారీ సగటు డేటా వినియోగం 25 శాతం పెరగడం గమనార్హం. 

గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)తోపాటు ఇతర ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో డేటా కనెక్షన్లకు గిరాకీ పెరిగింది. ఆన్‌లైన్‌ తరగతుల కోసం టెలికం సేవాసంస్థల బ్రాడ్‌బ్యాండ్‌ అద్దె రూ.299 నుంచి ప్రారంభం అవుతోంది.

also read ట్రిపుల్ రియర్ కెమెరాతో మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్.. ...

ఇంటర్నెట్‌ వేగం, సామర్థ్యం మేరకు బ్రాడ్ బ్యాండ్ డేటా ధరలు ఉన్నాయి. గరిష్ఠ డేటా వినియోగం దాటిన తరువాత 512 కేబీ నుంచి రెండు ఎంబీపీఎస్‌ వేగం కల్పిస్తున్నాయి.

వినియోగదారులు తమ పిల్లల ఆన్‌లైన్‌ తరగతుల కోసం సగటున నెలకు కనీసం 200 నుంచి 350 జీబీ డేటా వినియోగ సామర్థ్యం కల కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఇందుకు అద్దె రూ.500 నుంచి రూ.699 వరకు చెల్లించాల్సి వస్తోంది. 

డేటావేగం 30 ఎంబీపీఎస్‌ నుంచి 150 ఎంబీపీఎస్‌ వరకు ఉంటోంది. ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటి నుంచి పని పెరగడంతో డేటా వినియోగం పెరుగుతోందని ఓ టెలికం సేవా సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో వారాంతాల్లో డేటా వినియోగం ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం సాధారణ రోజుల్లోనూ అదే స్థాయిలో ఉంటోంది.

గతంలో వారాంతంలో సెలవుల వల్ల డేటా వినియోగం పెరిగేది. కానీ ఇప్పుడు స్కూళ్లు, వివిధ కోర్సుల విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల బోధన, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వంటి కార్యక్రమాల వల్ల డేటా వినియోగం పెరుగుతున్నది.