హైదరాబాద్: ఐటీ కంపెనీలు.. వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం పఠిస్తున్న మంత్రం ‘వర్క్‌ ఫ్రం హోం’.. ఏకంగా 70 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి విజ్రుంభిస్తున్న నేపథ్యంలో దేశంలో దాదాపు అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాయి. 

మున్ముందు ఈ విధానమే ఐటీ కంపెనీల భవిష్యత్‌ పని విధానంగా మారుతుందేమోనని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఆయా టెక్నాలజీ సంస్థలు కూడా నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి వర్క్ ఫ్రం హోం పద్దతిని కొనసాగించేందుకు మొగ్గుచూపుతాయని వారు అంటున్నారు. 

ఈ నేపథ్యంలో ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానంపై ప్రముఖ కన్సల్టెన్సీ ‘వేక్‌ఫిట్‌.కామ్‌’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆఫీసుకు వెళ్లేందుకు 79 శాతం మంది ఐటీ ఉద్యోగులు భయపడుతున్నారు. 

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించినా ఆఫీసుకు వెళ్లడానికి టెక్ నిపుణులు సుముఖత చూపడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీ ఉన్నతాధికారుల ఆదేశాలవల్ల కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. 

ఉద్యోగులు ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానంలో పని చేయాలని ఐటీ కంపెనీలు నెలవారీగా ఆదేశాలిస్తున్నాయి. 57 శాతం కంపెనీలు ఏ నెలకు ఆ నెల నెలకొన్న పరిస్థితిని సమీక్షించి ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానానికి అనుమతి ఇస్తున్నాయి. అంతేగానీ తదుపరి ఆదేశాలిచ్చేవరకు ‘వర్క్‌ ఫ్రం హోం’ అని ఓసారి అనుమతించడంలేదు.

ఐటీ కంపెనీలు 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తిగా ‘వర్క్‌ ఫ్రం హోం’ వసతి కల్పించాయి. కరోనా వైరస్‌ పూర్తిగా తగ్గేవరకు ఇంటి నుంచే పని చేయాలని చెప్పేశాయి. ఐటీ సర్వీస్‌ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రం విడతల వారీగా ఆఫీసుకు రమ్మని చెబుతున్నాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి పని చేస్తున్నామని 59 శాతం మంది ఐటీ ఉద్యోగులు చెప్పారు. ఈ విధానం తమకు సంతృప్తినివ్వడం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ ముప్పు తొలగిపోతే ఆఫీసుకు వెళ్లి పనిచేసేందుకే తాము మొగ్గుచూపుతామని వారు చెప్పారు. అలా చెబుతున్న వారిలో 50 శాతం మంది 45 ఏళ్లు దాటిన వారే ఉండటం గమనార్హం.

also read టెలికం సంస్థల డేటా చార్జీలు పెంపు..ఈవై అంచనా ...

కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడానికి ఐటీ కంపెనీలు తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలపై ఉద్యోగులు విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. 60 శాతం మంది తమ కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించడంలేదని ముందస్తు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

మున్ముందు తమపై పనిభారం అమాంతంగా పెరుగుతుందని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు. కరోనా ముప్పు తొలిగిన తర్వాత పని ఒత్తిడి పెరుగుతుందని 72 శాతం మంది చెప్పారు. ఆఫీసులో అంటే ఓ చోట కూర్చుని పనిచేయగలంగానీ ఇంట్లో అలా కుదరడంలేదని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.

ఇంట్లో అయితే రోజులో 3,4 చోట్లకు మారుతూ పనిచేస్తున్నామని 37 శాతం మంది చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇంట్లో ఇష్టానుసారంగా కూర్చుంటూ గంటల తరబడి పనిచేస్తుండటంతో వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని 76 శాతం మంది చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని 68 శాతం మంది చెప్పారు. దాంతోనే తమపై మానసిక ఒత్తిడి తగ్గి  బాగా పని చేయగలిగామని ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐటీ కంపెనీలు దాదాపు వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని కొనసాగిస్తున్నాయి.

వైరస్‌ ముప్పు తొలగిపోయే వరకు ఇది తప్పదని, ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటిని కూడా నేర్చుకుని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు.