టెలికం సంస్థల డేటా చార్జీలు పెంపు..ఈవై అంచనా
వచ్చే డిసెంబర్ నెలలో టెలికం సంస్థలు తమ వినియోగదారులపై డేటా చార్జీలు మోపడం ఖాయంగా కనిపిస్తోంది. తప్పనిసరిగా ఏజీఆర్ బకాయిలను చెల్లించడం సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం ఖాయమని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పేర్కొంది.
న్యూఢిల్లీ: దాదాపుగా మూడున్నరేళ్లుగా దేశీయ టెలికం రంగంలో ధరల తగ్గింపు కొనసాగుతూ వచ్చింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల అంశం ప్రస్తావనకు రావడంతో గతేడాది డిసెంబర్ నెలలో దేశీయ టెలికం సంస్థలు డేటా చార్జీలు పెంచేశాయి. తాజాగా కరోనా కష్టకాలంతో అన్ని రంగాల పరిశ్రమల మాదిరిగానే టెలికాం రంగం ఇక్కట్లను ఎదుర్కొంటున్నది.
ఈ క్రమంలో టెలికం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ మున్ముందు ఛార్జీల తగ్గింపు యుద్ధానికి ఇక తెరపడినట్టే. కంపెనీలు ఇక చార్జీల పెంచడమే తప్ప, తగ్గించే సూచనలు కనిపించడం లేదు.
వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నరలో దేశంలో టెలికాం కంపెనీలు 2 విడతలుగా చార్జీలు పెంచక తప్పదని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) అంచనా వేసింది. కోవిడ్ మహమ్మారి లేకపోతే గత నెలలోనే ఈ పెంపు ఉండేదని తెలిపింది.
ప్రస్తుత టెలికాం చార్జీలు ఏ మాత్రం గిట్టుబాటు కానందున, చార్జీలు పెంచడం తప్ప, కంపెనీలకు మరో మార్గం లేదని ఎర్నెస్ట్ అండ్ యంగ్ స్పష్టం చేసింది. బహుశా వచ్చే డిసెంబర్ నెలలోనే తొలి విడత చార్జీల పెంపు ఉండొచ్చని అంచనా వేసింది.
ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా టెలికాం కంపెనీలు ఇప్పటికిపుడు చార్జీలు పెంచే అవకాశమైతే లేదని ఎర్నెస్ట్ అండ్ యంగ్ స్పష్టం చేసింది. కోవిడ్ దెబ్బతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కూడా కాదని తెలిపింది.
also read అందరూ అలా చేస్తే తప్పకుండ ఆ ఆప్షన్ ప్రవేశపెడతాం: ట్విట్టర్ ...
కోవిడ్ తర్వాత పెంచే చార్జీల భారమూ, వినియోగదారులు భరించే స్థాయిలోనే ఉంటుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా వేసింది. అయితే ఈ చార్జీల పెంపు రెగ్యులేటరీ సంస్థల చొరవతో జరుగుతుందా? లేక కంపెనీల చొరవతో జరుగుతుందా? అనే విషయం వేచి చూడాల్సిందేనని ఈవై పేర్కొంది.
చార్జీలు పెంచక పోతే టెలికాం సంస్థలు ఆర్థికంగా కోలుకోవడం కష్టమని కూడా ఎర్నెస్ట్ అండ్ యంగ్ స్పష్టం చేసింది. మిగతా వర్థమాన దేశాలతో పోల్చినా మన దేశంలో చార్జీలు ఇప్పటికీ తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.
దేశీయ టెలికం కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే, మన దేశంలోనూ చార్జీలు కనీసం మిగతా వర్థమాన దేశాల స్థాయిలో ఉండాలని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పేర్కొంది. పీకల్లోతు అప్పులకు తోడు రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిల భారం ఇప్పటికే దేశంలోని టెలికాం కంపెనీలను భయపెడుతోంది. వొడాఫోన్ అయితే 2020 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో భారత కార్పొరేట్ రంగ చరిత్రలో కనీవినీ ఎరగని స్థాయిలో రూ.73వేల కోట్ల భారీ నష్టం ప్రకటించింది.
దేశీయ టెలికం కంపెనీలు ప్రస్తుతం ఫిక్స్‌డ్ ప్రైస్ ప్లాన్లపైనే ఆధార పడుతున్నాయి. దీంతో ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి (ఆర్పూ) తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ఇది రూ.160 కూడా లేదు. ఇది కనీసం రూ.200కి చేరితే తప్ప, కంపెనీలు లాభనష్టాలు లేని స్థితికి రావు.
వచ్చే 2,3 ఏళ్లలో ‘ఆర్పూ’ 60 నుంచి 80 శాతం పెరిగితే తప్ప, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం కష్టమని పరిశ్రమ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ఫిక్స్‌డ్ ధరల విధానానికి బదులు, డేటా వినియోగ ఆధారిత చార్జీల విధానం తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.