న్యూఢిల్లీ: టెలికం శాఖ వచ్చే ఏడాది చివరి కల్లా 5జీ స్పెక్ట్రం మిల్లీ మీటర్ బాండ్లను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. కొత్త 5జీ స్పెక్ట్రంపై టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ అభిప్రాయాలను త్వరలో టెలికం శాఖ సేకరించనున్నది. ధరల విధానం, ఇతరత్రా అంశాలపై ట్రాయ్ సిఫారసులను కోరనున్నది.

5జీ శ్రేణిలోని 24.75-27.25 గిగాహెర్ట్జ్స్ తరంగాలను వచ్చే ఏడాది చివరికల్లా వేలం వేయాలనుకుంటున్నది. తాజాగా వేలం వేయనున్న 5జీ బాండ్స్ దేశ పర్యావరణ వ్యవస్థకు చాలా కీలకం కానున్నాయి. ఇందుకోసం విధి విధానాలను రూపొందించేందుకు వచ్చే నెల ట్రాయ్ అభిప్రాయం కోసం టెలికం శాఖ వెళ్లాలని చూస్తున్నది. 

also read గూగుల్ క్రోమ్ వాడుతున్నారా... అయితే మీరు తప్పకుండ చదవాల్సిందే...

ఈ తరంగాలు.. ఇటీవల డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) ఆమోదించిన స్పెక్ట్రం విక్రయ ప్రణాళికలో లేవు. ఈ నెల 20న రూ.5.22 లక్షల కోట్ల స్పెక్ట్రం అమ్మకపు ప్రణాళికకు డీసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న 22 టెలికం సర్కిళ్ల పరిధిలోని 8,300 మెగాహెర్ట్జ్ తరంగాలను వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో విక్రయించేందుకు డీసీసీ అనుమతినిచ్చింది. ఈ క్రమంలో 24.75-27.25 గిగాహెట్జ్ తరంగాలనూ వేలం వేయాలని టెలికం శాఖ భావిస్తున్నది. 

దీంతో ఈ తరంగాల ధర, ఇతరత్రా అంశాలపై సిఫారసుల కోసం ట్రాయ్ వద్దకు జనవరిలో వెళ్లనున్నదని సంబంధిత వర్గాల సమాచారం. 2020 మార్చి-ఏప్రిల్‌లో జరుగనున్న 8,300 మెగాహెట్జ్ స్పెక్ట్రం వేలంలో 35 శాతం మాత్రమే 5జీ సేవలకు అనువైనది.  దీంతో అదనపు 5జీ స్పెక్ట్రంపై టెలికం శాఖ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఇది ఎంతమాత్రం చాలదన్న భావన టెలికం శాఖలో వ్యక్తమవుతున్నది. అందుకే 5జీ శ్రేణిలోని కొత్త స్పెక్ట్రం వినియోగాన్ని తెరపైకి తెస్తున్నది. 

గతేడాది ఆగస్టు 1న 700, 800, 900, 1800, 2100, 2300, 2500, 3300-3400, 3400-3600 మెగాహెట్జ్ శ్రేణిలో స్పెక్ట్రం వేలానికి ట్రాయ్ సిఫార్సులు చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పటిదాకా 5జీ శ్రేణిలోని 24.75-27.25 గిగాహెట్జ్ తరంగాల జోలికి టెలికం శాఖ వెళ్లలేదు. ఈ క్రమంలో వీటి వేలానికీ సమయం ఆసన్నమైందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

త్వరలో 700 ఎంహెచ్జ్, 800 ఎంహెచ్జ్, 2000 ఎంహెచ్జ్ బాండ్ల వేలం ద్వారా రూ.5.22 లక్షల కోట్ల ఆదాయం సంపాదించాలని టెలికం శాఖ భావిస్తున్నది. ఈ మేరకు వేలం ధరలను టెలికం శాఖ రిజర్వు చేసింది. టెలికం నియంత్రణ సంస్థ సిఫారసులు వచ్చిన తర్వాత దీనిపై ముందుకు వెళుతుందని నిపుణులు చెబుతున్నారు.

also read బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్...

నష్టాల్లో ఉన్న దేశీయ టెలికం రంగాన్ని ఆదుకోవాలని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేసన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) పేర్కొంది, స్పెక్ట్రం ధరను తగ్గిస్తేనే 5జీ కొనుగోళ్లకు కంపెనీలు ఆసక్తి చూపించే వీలుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) అంటున్నది. 

కాబట్టి స్పెక్ట్రం ధరలను ఆమోదయోగ్యంగా ఉంచాలని కేంద్రాన్ని సీఓఏఐ కోరుతున్నది. ఇటీవల సర్దుబాటు స్థూల వార్షిక ఆదాయం (ఏజీఆర్)పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికం సంస్థలపై రూ.1.47 లక్షల కోట్ల భారం పడిన తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో వొడాఫోన్ ఐడియా మునుపెన్నడూ లేని నష్టాలను ప్రకటించినదీ విదితమే. ఏకంగా రూ.51 వేల కోట్ల నష్టాలను చూపింది. భారతీ ఎయిర్‌టెల్ సైతం రూ.23 వేల కోట్ల నష్టాలను ప్రకటించింది. దీంతో స్పెక్ట్రం ధరలు తక్కువగా ఉంటేనే పరిశ్రమ మనుగడకు శ్రేయస్కరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.