జడ్జిమెంట్‌పై రివ్యూకు టెల్కోస్?: కేంద్రం నుంచి జంట లాభాలు
ఏజీఆర్ మూడు నెలల్లో చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు గత నెల 25వ తేదీన ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరే యోచనలో టెలికం సంస్థలు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఉన్నాయి.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఏజీఆర్ చార్జీలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై సమీక్షా పిటిషన్ దాఖలు చేయాలని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా యోచిస్తున్నాయి. ఈ విషయమై న్యాయపరమైన అంశాలను చర్చిస్తున్నాయి. ఏ సమీక్షా పిటిషన్ దాఖలు చేయాలన్నా ఈ నెల 24వ తేదీ లోపే వేయాల్సి ఉంటుంది.
హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే విధమైన తీర్పునిస్తే కొన్నిప్రత్యేక కారణాలతో వీటిని పున: పరిశీలిస్తారు. వీటికి కూడా 30 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఈ అంశంపై స్పందించడానికి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నిరాకరించాయి.
సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత వొడాఫోన్ ఐడియా ప్రతిస్పందిస్తూ.. తీర్పు ప్రతిని అధ్యయనం చేసిన తర్వాత రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
Also Read:ఫిర్యాదులన్నీ ఫ్లిప్‌కార్ట్ పైనే.. తర్వాతీ జాబితాలో జియో, అమెజాన్
అయితే, సుప్రీంకోర్టు తీర్పెలా ఉన్నా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల కమిటీ దీనిపై టెలికం సంస్థలకు కొంత ఊరటనిచ్చే అవకాశాలు లేకపోలేదు. లైసెన్స్ ఫీజులో లెవీ తగ్గింపు వంటి నిర్ణయం తీసుకునే అధికారం ఈ కమిటీకి ఉంటుంది.
ఇదిలా ఉంటే వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ తక్కర్ మాట్లాడుతూ దేశంలోని టెలికం రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు టెల్కోలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఏజీఆర్‌పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారిందన్నారు.
టెలికం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ తక్కర్ అన్నారు. ఏజీఆర్ విషయమై కోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సన్నాహాలు చేస్తోందని అన్నారు.
కాగా టెలికం రంగానికి సెల్యులార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సులు చేసిందని వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ తక్కర్ గుర్తు చేశారు. అయితే తాము ఏ బ్యాంక్‌లకు బకాయిలు లేమని స్పష్టం చేశారు. ఫోర్ ప్రైసింగ్‌కు సంబంధించి ప్రభుత్వం సమీక్షించి, టెలికం రంగాన్ని ఆదుకోవాలని కోరారు.
Also read:సెర్చింజన్ లేకుండానే విపణిలోకి హువావే ‘మేట్ ఎక్స్
ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. కాగా ఇంత వరకు ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సిన విషయం తెలిసిందే.