Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్ ఉద్యోగుల రాజీనామా..దిగొచ్చిన సీఈఓ మార్క్ జుకర్ బర్గ్..

సిబ్బంది నిరసన తెలపడంతోపాటు ఉద్యోగులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు వాస్తవ పరిస్థితి బోధ పడింది. దీంతో పాలకులు హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యలను తొలగించే విషయమై సంస్థ విధానాన్ని పున: సమీక్షిస్తామని, ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తామని జుకర్ బర్గ్ హామీ ఇచ్చారు.

After employees protest, Mark Zuckerberg Promises Review Of Content Policies
Author
Hyderabad, First Published Jun 6, 2020, 10:55 AM IST

కాలిఫోర్నియా: జాత్యాహంకార నిరసనలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టుల సెగ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు తగిలింది. ఇటువంటి పోస్టుల విషయంలో సంస్థ విధానం మారాలంటూ ఉద్యోగుల డిమాండ్లు తీవ్రమవడంతో సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఓ మెట్టు దిగిరాక తప్పలేదు.

సిబ్బంది ఆశించిన సంస్కరణలు తీసుకొస్తామంటూ ఇటీవల మార్క్ జుకర్ బర్గ్ హామీ ఇచ్చారు. ట్రంప్ వివాదాస్పద కామెంట్లను ఇప్పటి వరకూ ఫేస్‌బుక్ నుంచి తొలగించకపోవడమేమిటంటూ ఉద్యోగులు.. ఆల్ హ్యాండ్స్ డౌన్ సమావేశంలో మార్క్‌పై మండిపడ్డ విషయం తెలిసిందే. 

‘లూటీలు మొదలైతే కాల్పులు మొదలవుతాయి’ అంటూ ట్రంప్ పెట్టిన పోస్ట్‌ విషయంలో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్‌ను తక్షణం తొలగించడమో లేక వినియోగదారులను హెచ్చరించే విధంగా మరేదైనా చర్య తీసుకోవడమో చేయాలంటూ డిమాండ్ చేశారు.

అయితే, ఈ సూచనకు తొలుత మార్క్ జుకఱ్ బర్గ్ అంగీకరించలేదు. అధ్యక్షుడి పోస్టులను తొలగించడం కష్టం అని, అవి కంపెనీ నిబంధనలను అతిక్రమించలేదని మార్క్ తొలుత సమర్థించుకునే ప్రయత్నం చేశారు.  సంస్థ విధానంలో సంస్కరణల విషయమై యోచిస్తానంటూ ఆయన పొడి పొడిగా సమాధానం ఇచ్చారు.

also read జియో సూపర్ ‘సిక్సర్‌’...: అబుదాబీ సంస్థతో వేల కోట్ల ఒప్పందం..

ఇది ఫేస్ బుక్ సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ కలగ జేసింది. ఈ క్రమంలో కొందరు సిబ్బంది సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయినట్టు కూడా సమాచారం. ఇలా నిరసనల సెగ తీవ్రమవుతున్న నేపథ్యంలో సీఈఓ మార్క్ తాజాగా ఓ మెట్టు దిగివచ్చారు. 

సంస్థ ఉద్యోగులు కోరుకున్న విధంగా వివాదాస్పద ఫేస్‌బుస్ పోస్టులకు సంబంధించి సంస్థ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు మార్క్ జుకర్ బర్గ్ అంగీకరించారు.

‘ట్రంప్ పోస్టును వివాదాస్పదమైనదిగా గుర్తించాలంటూ మీరు కొరుకుంటున్నారని నాకు తెలుసు. దీనిపై సమీక్షిస్తున్నాం. ప్రభుత్వాలు బలప్రయోగాన్ని పోత్సహించే విషయాలపై ఫేస్‌బుక్ నిబంధనలు పరిశీలిస్తున్నాం’ అని జుకర్ బర్గ్ తెలిపారు.

‘సంస్థ పాలసీలో చేయవలసిన మార్పులను తప్పక చేస్తాం. వివాదాస్పద పోస్టులను తొలగించడం లేదా అట్టే పెట్టడంతో పాటూ ఇతర చర్యలు ఏమైనా తీసుకోగలమా అనే విషయంలో కూడా సమీక్షలు చేపడుతాం’ అని జుకర్ బర్గ్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios