Asianet News TeluguAsianet News Telugu

జియో సూపర్ ‘సిక్సర్‌’...: అబుదాబీ సంస్థతో వేల కోట్ల ఒప్పందం..

రిలయన్స్‌ను రుణ రహిత సంస్థగా తీర్చి దిద్దాలన్న ముకేశ్ అంబానీ సంకల్పం త్వరలోనే సాకారమయ్యేలా కనిపిస్తోంది. అందుకోసం జియోలో వాటాలను వివిధ సంస్థలకు విక్రయిస్తున్నారు. తాజాగా అబుదాబీకి చెందిన సావరిన్ సంస్థ ‘ముబాదలా’ 1.85 శాతం వాటాలతో రూ. 9వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. తాజాగా సిల్వర్ లేక్ అదనపు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇప్పటిదాకా జియోలోకి రూ. 92,202 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లయింది.
 

Abu Dhabi company Mubadala to Invest Rs 9,093 Crore in reliance Jio
Author
Hyderabad, First Published Jun 6, 2020, 10:35 AM IST

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అనుబంధ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా  ’ముబదలా‘అబుధాబికి చెందిన సార్వభౌమ సంస్థ ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ జియోలో 1.85 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ దాదాపు రూ. 9,094 కోట్లు.  సుమారు నెలన్నర వ్యవధిలో జియోకి ఇది ఆరో ఒప్పందం. ఇప్పటిదాకా రిలయన్స్ జియోలోకి దాదాపు రూ. 92,202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

‘జియో ప్లాట్‌ఫామ్స్‌లో ముబాదలా రూ. 9,093.60 కోట్ల మేరకు పెట్టుబడి పెడుతోంది. దీని ప్రకారం కంపెనీ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని జియో వెల్లడించింది. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు ఫేస్‌బుక్, సిల్వర్‌ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్‌ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా ఇప్పటిదాకా ఇన్వెస్ట్‌ చేశాయి.

టెలికం సేవలు అందించే జియో ఇన్ఫోకామ్‌ సహా డిజిటల్‌ వ్యాపార విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి తెస్తూ జియో ప్లాట్‌ఫామ్స్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియోకు 38.8 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు.  

గత ఏప్రిల్‌ 22వ తేదీన జియోలో అమెరికాకు చెందిన సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 9.99శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 43,574 కోట్లు. ఆ తర్వాత కొద్ది రోజులకే సిల్వర్‌ లేక్‌ రూ. 5,666 కోట్లతో 1.15% వాటాలు దక్కించుకుంది.

గత నెల 8వ తేదీన అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌ రూ. 11,367 కోట్లు వెచ్చించి 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇక, మే 17న అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ 1.34 శాతం వాటాలను రూ. 6,598 కోట్లకు దక్కించుకుంది.

అటుపైన మరో ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ కూడా రూ. 11,367 కోట్లతో 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే వివిధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ జరుపుతోంది. 

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్దేశించుకున్న గడువులోపే రిలయన్స్ లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. చేతిలో ఉన్న నగదు నిల్వలను సర్దుబాటు చేసిన తర్వాత ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రిలయన్స్‌ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది.  

also read లాక్ డౌన్ వల్ల ‘వర్క్ ఫ్రం హోం’ కల్చర్..క్లారిటీ లేకుంటే కష్టమే..

వినూత్న వ్యాపారాలకు తోడ్పాటు అందించేందుకు ముబాదలా 2017లో కొత్తగా వెంచర్స్‌ విభాగం ప్రారంభించింది. ఇది ప్రస్తుతం అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాల్లో పలు వెంచర్‌ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. ముబాదలా పోర్ట్‌ఫోలియో లో అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్, మెటల్స్, మైనింగ్, ఫార్మా, మెడికల్‌ టెక్, పునరుత్పాదక విద్యుత్‌ తదితర సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి.  

జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్‌ లేక్‌ కొత్తగా రూ. 4,547 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ సంస్థ జియోలో ఇప్పటికే రూ. 5,656 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. అంతా కలిపి 2.08% వాటా కోసం సిల్వర్‌ లేక్‌ సుమారు రూ. 10,203 కోట్లు వెచ్చించినట్లవుతుంది. 

తాజా పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌ సుమారు 19.90% వాటాలు విక్రయించి రూ. 92,202.15 కోట్లు సమీకరించినట్లవుతుంది. టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు 1999లో ఏర్పాటైన సిల్వర్‌ లేక్‌ ఇప్పటిదాకా ట్విటర్, ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా వంటి దిగ్గజ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

ముబాదలా కంపెనీతో అనుబంధంపై ముకేశ్ అంబానీ స్పందిస్తూ ‘అబుధాబితో నాకు దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలకు యూఏఈని మరింతగా అనుసంధానించడంలో ముబాదలా ప్రభావవంతంగా పనిచేయడం నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థల వృద్ధిలో కీలకపాత్ర పోషించిన ముబాదలా అనుభవం మాకు ఉపయోగపడుతుంది’ అని తెలిపారు. 

రిలయన్స్ జియోలో పెట్టుబడులపై ముబాదాలా గ్రూప్ సీఈఓ ఖల్దూన్ అల్ ముబారక్ మాట్లాడుతూ ‘కీలక సవాళ్లను అధిగమించే దిశగా కొంగొత్త టెక్నాలజీలను తయారు చేస్తున్న అధిక వృద్ధి స్థాయి కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు మేము కట్టుబడి ఉన్నాం. క్రియాశీలకంగా కలిసి పనిచేస్తాం’ అని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios