Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలోకి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ‘ది గ్రేట్’ ఖలీ... గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ప్రచారం చేసి...

The Great Khali: బీజేపీలో చేరిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, ప్రొఫెషనల్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ...  ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటన...

WWE Star, professional Indian Wrestler The Great Khali joins BJP before Elections
Author
India, First Published Feb 10, 2022, 5:14 PM IST

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, ప్రొఫెషనల్ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరిన ఖలీ, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. డబ్ల్యూడబ్ల్యూఈలో ‘ది గ్రేట్ ఖలీ’గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఖలీ అసలు పేరు దలీప్ సింగ్ రాణా. హిమాచల్ ప్రదేశ్‌లో దిరైనా ఏరియాలో జన్మించిన ఖలీ వయసు 49 ఏళ్లు. ఏడుగురు సంతానంలో ఒకడైన రాణా, అనేక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాడు.

సిమ్లాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాణాను గుర్తించిన ఓ పంజాబ్ పోలీస్ ఆఫీసర్, అతనికి పోలీసు ఉద్యోగం రావడంలో సాయం చేశాడు. అలా 1993లో పంజాబ్ పోలీస్‌ శిక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్‌ నుంచి పంజాబ్‌లోని జలంధర్‌కి వెళ్లిన రాణా, అక్కడి జిమ్స్‌లో శిక్షణ తీసుకుని రెజ్లర్‌గా మారాడు... పంజాబ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన రాణా, డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించుకున్నాడు... 

ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో దలిప్ సింగ్, జెయింట్ సింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఖలీ, డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. భారత్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ సంతకం చేసిన మొట్టమొదటి ప్రొఫెషనల్ రెజ్లర్ రాణాయే...

7 అడుగుల 1 ఎంచు పొడవాటి భారీ ఖాయంతో అజానుబాహుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఖలీ, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు... హాలీవుడ్ మూవీస్ ‘ది లాంగెస్ట్ యార్డ్’, ‘గెట్ స్మార్ట్’, ‘మాక్‌గ్రూబర్’ వంటి సినిమాల్లో నటించిన ది గ్రేట్ ఖలీ, బాలీవుడ్‌లో ‘కుస్తీ’, ‘రామా ది సేవియర్’, ‘హౌబా’ వంట సినిమాల్లో కనిపించాడు. 

హిందీ రియాల్టీ షో బిగ్ బాష్ సీజన్ 4లో పాల్గొన్న ఖలీ, రన్నరప్‌గా నిలిచాడు. దీంతో పాటు ‘అవుట్ సోర్స్‌డ్’, ‘పెయిర్ ఆఫ్ కింగ్స్’ వంటి టీవీ షోల్లోనూ కనిపించిన ఖలీ, డబ్ల్యూడబ్ల్యూఈలో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్ గెలిచాడు. 

"

రాజకీయాల్లో చేరిన ది గ్రేట్ ఖలీ, ఏషియానెట్‌ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘నేను డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటే అమెరికాలోనే ఉండిపోయేవాడిని. నేను ప్రపంచదేశాలన్నింటినీ రెజ్లింగ్ చేశాను. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, యూరప్ వంటి దేశాలన్నీ చుట్టాను. అయితే ఏ దేశమేగినా కన్నతల్లిని మరవకూడదనే ఉద్దేశంతో మళ్లీ ఇక్కడికి వచ్చాను...

నాకు దేశం మీద అమితమైన ప్రేమ ఉంది. నరేంద్ర మోదీ వంటి నాయకుడు ప్రధానిగా ఉన్న బీజేపీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. మోదీ ఐడియాలజీ నాకు ఎంతగానో నచ్చింది. పార్టీ కోసం, దేశం కోసం కష్టపడడానికి నేను సిద్దంగా ఉన్నాను... పార్టీ ఆదేశిస్తే ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అంటూ తెలిపాడు ఖలీ... 

అయితే భారతీయ జనతా పార్టీలో చేరిన ది గ్రేట్ ఖలీ, ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేయడం విశేషం. అందరూ ఖలీ, ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతాడేమోనని భావిస్తున్న సమయంలో బీజేపీలో చేరి ఆశ్చర్యానికి గురి చేశాడు...  

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, గత ఏడాది బీజేపీలో చేరింది. అంతకుముందు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, మాజీ షూటర్ రాజవర్థన్ సింగ్ రాథోడ్, రెజ్లర్ బబితా ఫోగట్ కూడా ఇప్పటికే బీజేపీలో సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios