ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అడిలైడ్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో టీంఇండియా వికెట్ కీఫర్ రిషబ్ పంత్ అద్భుతం చేశాడు. ఇప్పటివరకు ఏ భారత వికెట్ కీఫర్ కి సాధ్యం కాని ఫీట్ సాధించాడు. ఏకంగా ఆరుగురు ఆసీస్ బ్యాట్ మెన్స్ ను ఔట్ చేయడంలో భాగస్వామ్యం వహించడం ద్వారా ఈ యువ ఆటగాడు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 

ఇప్పటివరకు భారత జట్టులో సీనియర్ ఆటగాడు ఎంఎస్. ధోని పేరిట వున్న రికార్డును రిషబ్ బద్దలుగొట్టాడు. ఇప్పటివరకు ధోని వికెట్ కీఫర్ గా ఐదుగురు ఆసీస్ బ్యాట్ మెన్స్ ని ఔట్ చేయడంలో రెండు సార్లు భాగస్వామ్యమయ్యారు. కానీ అడిలైడ్ టెస్టులో వికెట్ కీఫర్ గా వ్యవహరించిన రిషబ్ మాత్రం ఆరుగురిని ఔట్ చేయడంతో భాగస్వామ్యం వహించి ధోనిని వెనక్కి నెట్టాడు. 

టీంఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సీరిస్ ఆడనుంది. ఈ సీరిస్ ఆరంభ మ్యాచ్ అడిలైడ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు 250 పరుగుల స్వల్ఫ  స్కోరు వద్దే ఔటవగా... ఆసీస్ ను కూడా కేవలం 235 పరుగులకే ఆలౌట్ చేసి స్వల్ఫ స్కోరుకే కట్టడి చేయడం ద్వారా టీంఇండియా పైచేయి  సాధించింది. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ గా రిషబ్ బౌలర్లకు సహకారంగా ఆరు క్యాచ్ లను అందుకున్నాడు.  తద్వారా ఆసీస్‌పై ఈ ఫీట్ సాధించిన తొలి భారత కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు.