వివాదాల నుంచి ఎలా బయటపడాలో.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బాగా తెలుసునని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు.  పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ తో కోహ్లీ గొడవ పడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ విషయంలో కోహ్లీపై పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనిపై అనిల్ కుంబ్లే తాజాగా స్పందించారు.

ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందో అంచనావేయగల సత్తా కోహ్లీకి ఉందని కుంబ్లే అన్నారు. వివాదాల నుంచి ఎలా బయట పడాలో అతడికి బాగా తెలుసునన్నారు.  ఇక ఆట విషయానికొస్తే మ్యాచ్‌ల్లో అతడి ప్రతిభ అత్యున్నత స్థానంలో ఉంటుందన్నారు.

 మ్యాచ్‌ పరిస్థితులను తన అధీనంలోకి తెచ్చుకుంటాడని.. మూడు ఫార్మేట్లలోనూ కోహ్లీ అదరగొడతాడని అభిప్రాయపడ్డారు.  ఇక సచిన్‌తో కోహ్లీ పోలికను  తానెప్పుడూ సమర్థించనన్నారు. ఇద్దరి గురించి పోల్చుతున్నప్పుడు వారి గురించి పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలన్నారు.

 కోహ్లీకి ఇంకా భవిష్యత్తు ఉందని.. ఇంకా ఎన్నో రికార్డులను సృష్టించగలడన్నారు.  ఒకటి , రెండు సంఘటనలు చూసి కోహ్లీని సచిన్ తో పోల్చలేమన్నారు. సచిన్ అప్పటి పరిస్థితులు.. ఇప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నయన్నారు.