టోక్యో ఒలింపిక్స్: చరిత్ర సృష్టించిన భారత మహిళా హాకీ జట్టు... సెమీస్‌లోకి ప్రవేశం...
ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో గెలిచిన టీమిండియా...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. మూడోసారి ఒలింపిక్స్ ఆడుతూ, సెమీస్ చేరింది. 1980లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళా జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
టోక్యో ఒలింపిక్స్ 2020 వుమెన్స్ హాకీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1-0 తేడాతో సెమీస్‌కి ప్రవేశించింది.
ఆట ప్రారంభమైన తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్‌లో 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సరిగ్గా వినియోగించుకున్న గుర్జిత్ కౌర్, గోల్ సాధించి టీమిండియాకి 0-1 తేడాతో ఆధిక్యం అందించింది.
మూడో క్వార్టర్‌లో గోల్ చేసేందుకు ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నాలను భారత జట్టు సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఆఖరి 3 నిమిషాల్లో ఆస్ట్రేలియాకి రెండు పెనాల్టీ కార్నర్స్ లభించడంతో ఉత్కంఠ రేగింది. అయితే రెండు అవకాశాల్లోనూ ఆసీస్‌ను సమర్థవంతంగా అడ్డుకుంది భారత జట్టు.