Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన టీమిండియా... ఇండోనేషియాని ఓడించి థామస్ కప్ 2022 టోర్నీ కైవసం...

Thomas Cup 2022: ఫైనల్‌లో ఇండోనేషియాని ఓడించి, తొలిసారి థామస్ కప్ కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు...

Thomas Cup 2022:  Team India Creates History, Wins maiden Thomas Cup by beating Indonesia

థామస్ కప్ 2022 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో 14 సార్లు టైటిల్ గెలిచిన ఇండోనేషియాని చిత్తు చేసి తొలిసారి థామన్ కప్ టోర్నీని కైవసం చేసుకుంది భారత జట్టు.  క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియాని, సెమీ ఫైనల్‌లో డెన్మార్క్‌ని ఓడించిన ఫైనల్ చేరిన భారత బ్యాడ్మింటన్ జట్టు,... ఫైనల్‌లో టాప్ టీమ్ ఇండోనేషియాపై పూర్తి ఆధిపత్యం చూపించి... 3-0 తేడాతో మొట్టమొదటి టైటిల్ కైవసం చేసుకుంది...

క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్ మ్యాచుల్లో వరుస ఓటములు ఎదుర్కొన్న భారత టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, ఫైనల్ మ్యాచ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి డబుల్స్‌లో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్ విజయంతో మూడు విజయాలు వరుసగా అందుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు... 14 సార్లు టైటిల్ గెలిచిన ఇండోనేషియాకి ఊహించిన షాక్ ఇచ్చింది...

క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్‌లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన భారత టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, ఫైనల్ మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. ఒలింపిక్ కాంస్య పతక విజేత ఆంటోనీ గింటింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8-21, 21-17, 21-16 తేడాతో విజయాన్ని అందుకున్నాడు లక్ష్యసేన్...

తొలి గేమ్‌లో 8-21 తేడాతో ఓడిన లక్ష్యసేన్, వరుసగా ప్రత్యర్థికి 12 పాయింట్లు అప్పగించాడు. ఫైనల్‌లోనూ లక్ష్యసేన్ ఓడిపోవడం ఖాయమనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో ఫైటింగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన లక్ష్యసేన్, వరుసగా రెండు సెట్లను సొంతం చేసుకుని, భారత జట్టుకి 1-0 తేడాతో ఆధిక్యం అందించాడు.. 

ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి, అహ్సన్- సుకామ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18-21, 23-21, 21-19 తేడాతో పోరాడి గెలిచారు. మొదటి సెట్‌లో ఓడిన తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత డబుల్స్ జోడి, వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ని కైవసం చేసుకుంది... వరుసగా రెండో విజయంతో భారత జట్టు 2-0 తేడాతో ఇండోనేషియాపై తిరుగులేని ఆధిక్యం సాధించింది...

ఇంకా మూడు మ్యాచులు మిగిలి ఉండడంతో భారత జట్టు టైటిల్ ఆశలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. భారత టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, ఇండోనేషియాకి చెందిన జోనాథన్ క్రిస్టీనీ 21-15, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు... 

ఎలాంటి హై డ్రామా లేకుండా విజయాన్ని అందించాడు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో మొట్టమొదటి టైటిల్ సాధించింది భారత బ్యాడ్మింటన్ జట్టు. ఇప్పటివరకూ థామస్ కప్‌ని కేవలం ఆరు జట్లు మాత్రమే గెలవగలిగాయి. ఇండోనేషియా 14 సార్లు గెలిచి టాప్‌లో ఉంటే చైనా 10 సార్లు, మలేషియా 5 సార్లు ఈ టైటిల్ గెలిచాయి. డెన్మార్క్, జపాన్ చెరోసారి టైటిల్ సాధించాయి. ఇప్పుడు భారత జట్టు, థామస్ కప్ గెలిచిన ఆరో జట్టుగా నిలిచింది... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios