బాల్ ట్యాంపరింగ్‌లో దొరికిపోయి నిషేధం ఎదుర్కొంటున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు, ప్రియురాలు అయిన డాన్ విల్లీస్‌ను పెళ్లాడాడు. గతేడాదే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరగ్గా సెప్టెంబరులో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్మిత్ ప్రకటించాడు. అనుకున్నట్టే ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య శనివారం సిడ్నీలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

వివాహం అనంతరం స్మిత్ తమ పెళ్లి ఫొటోను ట్వీట్టర్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లాడానని, విల్లీస్ నమ్మశక్యం కానంత అందంగా ఉందని పేర్కొన్నాడు. బిగ్ బాష్ లీగ్ ప్రారంభ సీజన్‌లో ఓ బార్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. లా, కామర్స్ చదువుకున్న విల్లీస్‌ వద్ద తొలుత స్మిత్ తన ప్రేమను బయటపెట్టాడు.

ఈ ఏడాది మార్చిలో స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బౌలర్ కేమరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి దొరికిపోయారు. విషయం తెలిసి క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చేసిన తప్పును ఈ ముగ్గురూ స్వయంగా అంగీకరించడంతో బోర్డు వారిపై వేటేసింది.