సుధీర్ఘ కెరీర్‌లో ఎలాంటి మచ్చా లేకుండా క్రీడా జీవితం నుంచి నిష్క్రిమించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. మైదానంలో ప్రత్యర్థులు ఎంతగా కవ్వించినా బ్యాట్‌తోనే సమాధానం చెప్పేవాడు తప్పించి కట్టుతప్పేవాడు కాదు. అలాంటి సచిన్ మహా తుంటరి, అల్లరోడు అంటున్నాడు టీమిండియా మాజీ  కెప్టెన్ సౌరవ్ గంగూలి.

అండర్-15 దగ్గర నుంచి నేటి వరకు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.. ప్రపంచంలోనే నెంబర్‌వన్ ఓపెనింగ్ జోడీ.. తాజాగా తన మిత్రుడు సచిన్ గురించి సౌరవ్ ఏం చెప్పాడంటే.. అండర్-15 ఆడే సమయంలో నేను, సచిన్, వినోద్ కాంబ్లీ చెన్నైలోని ఎమ్ఆర్ఎఫ్ పేస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాం.. ఒకరోజు నేను నిద్రపోయి లేచే సరికి నా గదంతా నీటితో నిండిపోయింది. బాత్రూంలో ట్యాప్ లీక్ అయ్యిందో..? లేక ఏమైందోనని బయటకు వెళ్లి చూస్తే.. సచిన్-కాంబ్లీ ఇద్దరూ  బకెట్‌లో నీళ్లు తీసుకువచ్చి మా గదిలో పోశారని తెలిసింది.

ఇలా ఎందుకు చేశారని అడిగితే.. మధ్యాహ్నం సమయంలో ఎందుకు పడుకున్నావ్... ప్రాక్టీస్‌కు వెళ్దాం పదా అన్నాడు దాదా. అలాగే సచిన్ రోజంతా ప్రాక్టీస్ చేసేవాడని.. తాను మాత్రం మధ్యమధ్యలో విరామం తీసుకునేవాడినని తెలిపాడు.

సచిన్‌ నెట్స్‌కే అంకితమైన సందర్భాల్లో మేనేజర్ టెండూల్కర్‌ను బలవంతంగా నెట్స్ నుంచి బయటకు పంపేవాడని.. ఏదైనా మ్యాచ్ ఉంటే సచిన్ నిద్రపోడని.. 1992లో ఆసీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు ముందురోజు సచిన్ మధ్య రాత్రిలో నిద్రలేచాడు. పడుకోవచ్చు కదా అని అడిగితే.. ఈ రోజు బ్యాటింగ్ చేయాలి..  నిద్రపట్టడం లేదన్నాడట.