ఆస్ట్రేలియా జట్టులో ఏడేళ్ల బాలుడు స్థానం సంపాదించాడు. అంతేకాదు ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో భారత్‌తో జరిగే మూడో టెస్టుకు తలపడే ఆసీస్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఏడేళ్ల చిన్నారి... జాతీయ జట్టులో స్థానం సంపాదించడమేంటి అనుకుంటున్నారా..? ఈ బుడతడి పేరు ఆర్చీ స్కిలర్. ఇతడికి మూడు నెలల వయసులోనే గుండె కవాటంలో లోపం ఉందని తెలిసింది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడికి పలు గుండె ఆపరేషన్లు జరిగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు నిత్యం పోరాడాల్సిందే. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఆర్చీకి.. ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించాలన్నది కల.

ఈ విషయం తెలుసుకున్న ‘‘మేక్ ఎ విష్ ఆస్ట్రేలియా ’’ స్కిలర్ కోరికను తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఆస్ట్రేలియా క్రికెట్ సంఘాన్ని ఒప్పించింది. ఫాండేషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ టెస్టుకి 15వ ఆటగాడికి స్థానం కల్పించింది.

దీనితో పాటు జట్టుకి కో-కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ ఇచ్చింది. ఆర్చీకి జట్టులో స్థానం కల్పించిన విషయాన్ని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ స్వయంగా ఫోన్‌లో తెలిపినప్పుడు.. క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతున్న స్కిల్లర్ కుటుంబసభ్యులకు మరింత సంతోషాన్ని కలిగించింది.

లెగ్‌ స్పిన్నరైన ఆర్చీ మిగతా జట్టు సభ్యులతో సాధన చేస్తున్నాడు. నాథన్ లైయన్ అంటే అతడికి చాలా ఇష్టం.. టిమ్ పైన్‌, కోహ్లీతో కలిసి ఆర్చీ స్కిలర్ ఆదివారం ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.